
హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.
భారత పేసర్ షమీ తన మొదటి ఓవర్‌లో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వన్డేల్లో భారత్ తరపున అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. షమీ 56 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
అతని తర్వాత ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్(59), జహీర్ ఖాన్(65), అజిత్ అగార్కర్(67), జవగల్ శ్రీనాథ్(68) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 28 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.