
హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇవ్వడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న టీమిండియాకు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బ్రేకులేశాడు.
దూకుడుగా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (43)ని షార్ట్‌పిచ్ బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. భారత్ ప్రస్తుతం 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. రాయుడు (32), ధోనీ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇప్పటివరకు భారత్ కోల్పోయి వికెట్లలో న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కగా, పెర్గూసన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకముందు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల వికెట్లను 4 ఓవర్ల వ్యవధిలోనే టీమిండియా కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై వీరిద్దరూ ఎదురుదాడికి దిగుతూ పోటాపోటీగా బౌండరీలు బాదారు.
హాఫ్ సెంచరీలతో చక్కటు శుభారంభానిచ్చిన ఈ జోడీ తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత జట్టు స్కోరు 154 వద్ద ట్రెంట్ బౌల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్(66) వికెట్ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఫర్గూసన్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని సిక్స్‌గా తరలించేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ(87) ఫీల్డర్ గ్రాండ్‌హోమ్ చేతికి చిక్కాడు. దీంతో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి అంబటి రాయుడు స్కోరు బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు.