
హైదరాబాద్: మౌంట్ మాంగనుయ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత బౌలర్ల ధాటికి కీలక వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలండ్ ఆరో వికెట్ కూడా చేజార్చుకుంది.
ప్రస్తుతం 30 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్(28), డగ్ బ్రాస్వెల్ (10) పరుగులతో ఉన్నారు. విజయానికి న్యూజిలాండ్ 160 పరుగుల దూరంలో ఉంది. మార్టిన్ గుప్టిల్ (15) స్థానంలో క్రీజులోకి వచ్చి వరుస బౌండరీలతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (20)ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు.
అనంతరం మరో ఓపెనర్ మన్రో (31)ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అనంతరం దూకుడు మీదున్న రాస్ టేలర్‌ను 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాదవ్ ఔట్ చేశాడు. 18 ఓవర్లో జాదవ్ వేసిన బంతికి టేలర్ స్టంపౌట్ అయ్యాడు.
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన మూడో బంతికి లాథమ్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగా... అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోంను కూడా కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ 27వ ఓవర్లో కుల్దీప్ వేసిన ఆరో బంతికి గ్రాండ్‌హోం షాట్‌కు ప్రయత్నించగా బంతి నేరుగా రాయుడు చేతుల్లోకి వెళ్లింది. భారత బౌలర్లలో కుల్దీప్‌కు రెండు, చాహల్, జాదవ్, షమీ, భువీ తలో వికెట్ తీసుకున్నారు.