కోహ్లీని ఔట్ చేసేందుకు బలహీనతలు వెతకలేదు.. ఎలా ఔట్ చేశానంటే: జేమీసన్

వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారాలు క్రీజులో పాతుకుపోయారంటే పరుగుల వరదే. ఈ ఇద్దరి వికెట్లు తీయడం ప్రత్యర్థి బౌలర్లకు ఎంతో కష్టం. ఎంతో శ్రమిస్తే గాని వీరి వికెట్ దక్కదు. అలాంటిది కైలీ జెమీసన్ అరంగేట్రం టెస్టులోనే వీరిద్దరినీ పెవిలియన్ పంపించి సంచలనం సృష్టించాడు. అద్భుత బంతులతో మేటి బ్యాట్స్‌మన్‌లను బోల్తా కొట్టించాడు. వీరితో పాటు మిడిలార్డర్‌లో ప్రధానమైన హనుమ విహారినీ ఔట్ చేశాడు. జెమీసన్ దెబ్బకు భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. జెమీసన్ 39 పరుగులకే కీలక నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు.

వెల్లింగ్టన్ టెస్టుతో అరంగేట్రం:
వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కైలీ జెమీసన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసాడు. జెమీసన్ 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్లలోనే అత్యంత పొడగరి ఇతగాడే. విరాట్ కోహ్లీ వికెట్ తీశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని జెమీసన్ అంటున్నాడు. కోహ్లీని ఔట్ చేసేందుకు అతడి బలహీనతలు వెతకలేదని కూడా పేర్కొన్నాడు.

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా:
తొలిరోజు మ్యాచ్ అనంతరం జెమీసన్ మాట్లాడుతూ... 'ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ టాప్ బ్యాట్స్‌మన్. ఎక్కడైనా పరుగులు చేయగలడు. అలాంటి కోహ్లీ వికెట్ తీయడాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చాలా సంతోషంగా ఉంది. రెండు వారాలుగా ఏం జరుగుతుందో అర్థమవ్వడం లేదు. ప్రస్థుహం మ్యాచును చూసుకుంటే మేమిప్పుడు మంచి స్థితిలో ఉన్నాం. కోహ్లీ అద్భుత ఆటగాడు. భారత బ్యాటింగ్ లైనప్‌లో అతడు కీలకం. విరాట్ త్వరగా ఔటవ్వడం మాకు కీలకం. ఇద్దరు (కోహ్లీ, పుజారా) ఆటగాళ్లను తొలి సెషన్‌లోనే పెవిలియన్‌కు పంపించడం నాకు ప్రత్యేకం' అని అన్నాడు.

బలహీనతల గురించి వెతకలేదు:
'విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు అతడి బలహీనతల గురించి వెతకడం తెలివైన పనికాదు. ఎందుకంటే.. అతడు అన్ని దేశాల్లోనూ పరుగులు చేస్తున్నాడు. స్టంప్‌కు విసిరితే కోహ్లీ చెలరేగి ఆడతాడు. అందుకే పిచ్ సహకారంతో స్టంప్ లైన్‌కు కొద్దిగా పక్కకు విసిరాను. అదృష్టవశాత్తూ బంతి అతడి బ్యాట్ అంచుకు తగిలి నాకు చిక్కాడు' అని జేమీసన్ చెప్పుకొచ్చాడు.

జేమీసన్ విజృంభణ:
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. పేసర్ కైల్ జేమీసన్ ( (4/39), సీనియర్ పేసర్ టీమ్ సౌతీ (4/49) విజృంభించడంతో వెల్లింగ్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్ అయింది. అనుకూలిస్తున్న పిచ్‌పై పేస్ కివీస్ బౌలర్‌లు చెలరేగడంతో రెండో రోజు మరో 43 పరుగులు చేసిన టీమిండియా.. 68.1 ఓవర్లలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె (46; 138 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications