హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం తిరువనంతపురం వేదికగా మూడో టీ20 జరగనుంది.
మంగళవారం (నవంబర్ 7)న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. గత మూడు రోజులుగా అక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో మైదానంలోని పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

సోమవారం ఇరు జట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నప్పటికీ వాతవరణం అనుకూలంగా లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్ సెషన్ రద్దు అయింది. మూడు టీ20ల సిరిస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో సిరిస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.
వర్ష సూచన నేపథ్యంలో కేరళ క్రికెట్ సంఘం స్పందించింది. 'స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. సాయంత్రం వర్షం కురిస్తే ఆగిపోయిన 20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలం. ఆదివారం రిహార్సల్ సైతం చేశాం. రోజు మొత్తం వర్షం కురిసినా నిమిషాల వ్యవధిలోనే సిద్ధం చేయగలం' అని కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి జయేశ్ జార్జ్ తెలిపారు.