

హైదరాబాద్: సొంతగడ్డపై టీమిండియాతో ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుని ప్రకటించారు. మొత్తం 14 మందితో కూడిన జట్టులో న్యూజిలాండ్ సెలక్టర్లు డారీ మిచెల్, బ్లెయిర్ టిక్‌నెర్ రూపంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.
సీనియర్ ఆటగాడు లూకీ ఫర్గూసన్‌ని మాత్రం తొలి రెండు టీ20లకు ఎంపిక చేశారు. మూడో టీ20లో అతడి స్థానంలో బ్లెయిర్ టిక్‌నెర్ ఆడనున్నాడు. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో న్యూజిలాండ్-ఏ తరుపున మిచెల్ 23 బంతుల్లో 61 పరుగులతో రాణించాడు. ఈ ప్రదర్శనే అతనికి టీ20 జట్టులో చోటు దక్కేలా చేసింది.
ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ 0-3తో సిరిస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లతో పాటు యువ క్రికెటర్లకీ టీ20 జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.
టీ20 సిరీస్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన నాలుగో వన్డే గురువారం ఉదయం 7.30 నుంచి హామిల్టన్ వేదికగా జరగనుంది.
భారత్‌తో మూడు టీ20ల సిరిస్‌కు కివీస్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, గ్రాండ్‌హోమ్, లూకీ ఫర్గూసన్ (రెండు టీ20లకి మాత్రమే), మార్టిన్ గప్తిల్, స్కాట్, డారీ మిచెల్, కొలిన్ మున్రో, మిచెల్ శాంట్నర్, టిమ్ సైపెర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్, టిక్‌నర్ (మూడో టీ20కి మాత్రమే)