వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత్ లక్ష్యం 147 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 45.5 బంతుల్లో 174 పరుగులకు ఆలౌటైంది. 171/9 మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్ మరో 14 బంతులే ఎదుర్కొని, మూడు పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ (8; 23 బంతుల్లో, 1 సిక్సర్)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో అయిదు వికెట్లతో చెలరేగాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (51; 100 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. గ్లెన్ ఫిలిప్స్ (26; 14 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (22; 47 బంతుల్లో, 2 ఫోర్లు), డారిల్ మిచెల్ (21; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 65.4 బంతుల్లో 235 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (82; 129 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విల్ యంగ్ (71; 138 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. రవీంద్ర జడేజా అయిదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది.
శుభ్‌మన్ గిల్ (90; 146 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషభ్ పంత్ (60; 59 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ అయిదు వికెట్లు తీశాడు. ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.