
హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్‌లో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. కివీస్ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరిస్ కావడం విశేషం. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ నిర్ణయించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(38), కేఎల్ రాహుల్(27)లు ఫరవాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బెన్నట్ మూడు వికెట్లు పడగొట్టగా... శాంట్నర్, గ్రాండ్‌హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.
సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్ బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 17 పరుగులు చేశారు. అనంతరం 18 పరుగుల విజయ లక్ష్యంతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. దీంతో భారత్ విజయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఆ తర్వాత మూడో బంతిని కేఎల్ రాహుల్ ఫోర్‌గా మలిచాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీయడంతో రోహిత్ శర్మ స్ట్రయికింగ్‌కు వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ రోహిత్ శర్మ సిక్సర్లుగా మలచడంతో టీమిండియా 20 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగడంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచింది.