చేతులెత్తేసిన భారత బౌలర్లు.. 29 బంతుల్లో గప్తిల్ హాఫ్ సెంచరీ!!

మౌంట్ మాంగనూయ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ బ్యాట్స్‌మన్‌లు పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా మార్టిన్ గప్తిల్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ ఆకాశామే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని భారీ సిక్సుగా బాది హాఫ్ సెంచరీ చేసాడు.
297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్ మంచి శుభారంభం ఇచ్చారు. గప్తిల్ మొదటి ఓవర్ నుండే బౌండరీల మోత మొదలెట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీలను ధీటుగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు చేసాడు. సైనీ వేసిన ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన గప్తిల్.. బుమ్రా వేసిన ఏడవ ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. యుజువేంద్ర చహల్, ఠాకూర్‌లను కూడా వదలలేదు. ఈ క్రమంలోనే 29 బంతుల్లో గప్తిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.
మరోవైపు హెన్రీ నికోల్స్ ఆచితూచి ఆడుతూ గప్తిల్‌కు మంచి సహకారం అందించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ గప్తిల్‌కు అండగా నిలిచాడు. హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ మరింత రెచ్చిపోయాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో చహల్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి గప్తిల్ (66) బోల్డ్ అయ్యాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (13) ఉన్నారు. కివీస్ 21 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది. కివీస్ విజయానికి ఇంకా 173 పరుగులు చేయాలి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 9) కీలక సమయంలో హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications