మొహాలి: న్యూజిలాండ్‌తో మొహాలిలో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన 48.2 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది. దీంతో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
లక్ష్య చేధనలో భాగంగా ధోనీ, కోహ్లీలు చక్కటి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. నాలుగో వన్డే ఈనెల 26న రాంచీలో జరగనుంది.

మూడో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ 104 బంతుల్లో సెంచరీ (10 ఫోర్లు)తో పూర్తి చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో కోహ్లీకి ఇది 26వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 42 ఓవర్లకు గాను భారత్ 3 వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 107, మనీశ్ పాండే 17 పరుగులతో ఉన్నారు.
మూడో వన్డేలో 80 పరుగుల వద్ద ధోని ఔట్
మొహాలిలో జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ ధోని సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ, ధోనీలు ఒకానొక స్టేజిలో సెంచరీలు చేసే దిశగా కనిపించారు. అయితే 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని పెవిలియన్‌కు చేరాడు. హెన్రీ బౌలింగ్‌లో రాస్‌టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 91 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. మ్యాచ్ గెలిచేందుకు భారత్ ఇంకా 83 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది.
సెంచరీలకు చేరువగా ధోనీ, కోహ్లీ 184/2 (34.0 ఓవర్లు)
మొహాలిలో జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లీలు చెలరేగి ఆడుతున్నారు. 286 పరుగుల విజయ లక్ష్యం కోసం బరిలోకి దిగిన వీరిద్దరూ చక్కటి భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నారు. 34 ఓవర్లకు గాను భారత్ 184 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని 75, కోహ్లీ 84 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 102 పరుగులు చేయాల్సి ఉంది.
ధోని అర్ధ సెంచరీ
మూడో వన్డేలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసిన కొద్ది సేపటికే కెప్టెన్ ధోని అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 58 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్సర్ల)తో అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. వన్డే క్రికెట్‌లో ధోనికి ఇది 61వ అర్ధ సెంచరీ.
9000: ధోని ఖాతాలో మరో రికార్డు, 5వ ఆటగాడిగా గుర్తింపు
మూడో వన్డేలో కోహ్లీ అర్ధ సెంచరీ 130/2 (25.1 ఓవర్లు)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. 49 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీకి ఇది 38వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం భారత్ 26 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 153 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోని 51, కోహ్లీ 59 పరుగులతో ఉన్నారు.
ఔట్ నుంచి తప్పించుకున్న కోహ్లీ
286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెహానే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆరంభంలోనే తడబడ్డాడు. హెన్రీ బౌలింగ్‌లో నాలుగో ఓవర్ నాలుగో బంతి ఎదుర్కొన్న కోహ్లీ షాట్‌కు యత్నించాడు. బంతిని సరిగా కొట్టలేకపోవడంతో వైడ్‌స్లిప్‌లో ఉన్న టేలర్‌కు క్యాచ్‌గా అందబోయింది. అయితే బంతిని పట్టుకోవడంలో టేలర్ విఫలమయ్యాడు. తృటిలో కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 45/2 (10.0 ఓవర్లు)
మూడో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభంలోనే రహానే వికెట్ కోల్పోయిన టీమిండియా... ఆ తర్వాత ఓపెనర్ రోహిత్ శర్మ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. 21 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 45 పరుగులుగా ఉంది.క్రీజులో ధోని 7, విరాట్ కోహ్లి 22 పరుగులతో ఉన్నారు.
నిరాశపరిచిన రహానే, భారత్ 40/1 (8.0 ఓవర్లు)
మొహాలి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 286 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రహానే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరడంతో 13 పరుగులకే భారత్ తోలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 12, విరాట్ కోహ్లి 21 పరుగులతో ఉన్నారు.
మూడో వన్డేలో భారత లక్ష్యం 286
మొహాలి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.4 ఓవర్లలో 285 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ లక్ష్యం 286 పరుగులుగా నిర్దేశించింది. మ్యాచ్ ఆరంభంలో నిలకడగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై కివీస్ బ్యాట్స్ మెన్ ఒత్తిడి పెంచారు.
న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్ (27), లాథమ్ (61), విలియమ్ సన్ (22), టేలర్ (44), ఆండర్సన్ (6), రోంచి (1), నీషమ్ (57), సాంత్నర్ (7), సౌథీ (13), బౌల్ట్ (1) పరుగులు చేయగా, హెన్రీ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఒకానొక దశలో 199 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను చివర్లో నీషమ్, హెన్రీ ఆదుకున్నారు.
ఈ ఇద్దరూ కలిసి 9వ వికెట్‌కు 84 పరుగులు జోడించారు. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా భారత బౌలర్లు బౌలింగ్ చేసి, కివీస్ మిడిలార్డర్‌ను భాగస్వామ్యం లేకుండా చేశారు. అయితే చివర్లో టెయిలెండర్లను ఔట్ చేయడానికి బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
దీంతో నీషమ్ 57, హెన్రీ 39 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు భారీ స్కోరు సాధించి పెట్టారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మిశ్రా, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

8 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 213/8 (41.0 ఓవర్లు)
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కివీస్ జట్టు 8 వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ సౌథీ 13 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ స్కోర్ 41 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 213 పరుగులు సాధించింది. ప్రస్తుతం కివీస్ 46 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించింది.
200 పరుగుల మార్కుని దాటిన న్యూజిలాండ్
మూడో వన్డేలో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును దాటింది. ఒకానొక దశలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన కివీస్ భారత్ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 37.5 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులతో కష్టాల్లో ఉంది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నీషమ్ (41 నాటౌట్) నిలకడగా ఆడుతూ మాట్ హెన్రీ (18 నాటౌట్)తో కివీస్‌ను 200 పరుగుల మైలురాయిని దాటించాడు.
అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న బుమ్రా
మూడో వన్డేలో న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుత జట్టు 35 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 153 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ జట్టును మిశ్రా, జాదవ్‌లు వరుస వికెట్లతో దెబ్బతీశారు. తాజాగా వారిద్దరితో బూమ్రా జత కలిశాడు. 35వ ఓవర్ ఐదో బంతికి సట్నర్‌ను ఔట్ చేశాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సట్నర్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

పెవిలియన్‌కి క్యూ కడుతున్న కివీస్ 180/7 (34.2 ఓవర్లు)
మూడో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. మిడిలార్డర్ విఫలం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతుంది. రోంచీ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సట్నర్ 13 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో దీంతో న్యూజిలాండ్ జట్టు 180 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సౌథీ 10, నీషమ్ 7 పరుగులతో ఉన్నారు.
ధోని స్టెంపింగ్ అద్భుతం
మూడో వన్డేలో కెప్టెన్ ధోనీ చెలరేగుతున్నాడు. వెకెట్ల వెనక అద్భుతమైన స్టంపింగ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ను కంగారు పెడుతున్నాడు. మిశ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్‌ను ఔట్ చేసిన ధోని, ఆ తర్వాత మిశ్రా బౌలింగ్‌లోనే రోంచిని అదే విధంగా ఔట్ చేశాడు. బంతిని ఆడేందుకు వీరిద్దరూ ఫ్రంట్ ఫూట్ వేయగా తిరిగి క్రీజ్‌లోకి చేరుకునే లోపలే ధోనీ వికెట్లను పడగొట్టి పెవిలియన్‌కు చేర్చాడు.
ఎవరికి అందనంత ఎత్తులో: ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు
కష్టాల్లో న్యూజిలాండ్ 180/6 (34.0 ఓవర్లు)
మొహాలిలో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. మిడిలార్డర్ విఫలం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతుంది. మ్యాచ్ ఆరంభంలో నిలకడగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచినా న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఆండర్సన్ (6), రోంచి (1) విఫలమవ్వడంతో 16 పరుగుల తేడాలో న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 169 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో జాదవ్ 3, మిశ్రా రెండు, యాదవ్ ఒక వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం 34 ఓవర్లకు గాను జట్టు 180 పరుగులు చేసింది.
ఐదో వికెట్ కోల్పోయన న్యూజిలాండ్ 161/5 (30.2 ఓవర్లు)
మూడో వన్డేలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. మిడిలార్డర్ లో ఆండర్సన్ (6), రోంచి (1) విఫలమయ్యారు. 8 పరుగుల తేడాలో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 30.2 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో అమిత్ మిశ్రా, జాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు విలియమ్సన్ 22, గప్టిల్ 27 పరుగులు చేసి ఔటయ్యారు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
మూడో వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. రాస్ టేలర్‌ను ధోనీ, మిశ్రా కలిసి పెవీలియన్‌కు పంపారు. స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన టేలర్‌ను ధోనీ స్టంపౌట్ చేశాడు. దీంతో టేలర్ 44 పరుగుల వద్ద వెనుదిరిగాడు. 29 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
నిలకడగా న్యూజిలాండ్, లాంథమ్ అర్ధ సెంచరీ
మొహాలి వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తోంది. కివీస్ బ్యాట్స్‌మెన్ లాంథమ్ అర్ధ సెంచరీని సాధించాడు. 59 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో లాంథమ్‌కి ఇది ఐదో అర్ధసెంచరీ. కెప్టెన్ విలియమ్సన్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాస్ టేలర్ 56 బంతుల్లో 44 పరుగులు చేసి లాథమ్‌కు తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 28 ఓవర్లకు గాను రెండు కోల్పోయి 150 పరుగులు సాధించింది.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 80/2
మూడో వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 80 పరుగల వద్ద 13వ ఓవర్‌లో స్పిన్నర్ కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 22 పరుగులు చేశాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ 73/1
మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆటగాళ్లపై ఆత్మవిశ్వాసం పెరిగినట్లుగా కనిపిస్తుంది. దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డుని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 73 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విలియమ్స్ 22, లాంథమ్ 22 పరుగులతో ఉన్నారు.
కివీస్ ఓపెనర్ గుప్టిల్ ఔట్, న్యూజిలాండ్ 46/1
మూడో వన్డేలో కీవీస్ మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే కివీస్ ఓపెనర్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఓపెనర్లు గప్టిల్, లాథమ్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో గుప్టిల్‌ను 27 వ్యక్తిగత పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ ఔట్ చేయడంతో ఆ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటికే గుప్టిల్ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. దీంతో కివీస్ జట్టు 7 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది.
వరుసగా ఏడోసారి టాస్ గెలిచిన టీమిండియా
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ మరోసారి టాస్ నెగ్గి ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా టాస్ నెగ్గడం ఇది వరుసగా ఏడోసారి. అయితే టాస్ నెగ్గడంలో కోహ్లీ, ధోనీల విషయంలో మాత్రం కొంత తేడా ఉంది. కోహ్లీ నేతృత్వంలో మూడు టెస్టుల్లోనూ టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా, వన్డేల్లో మాత్రం ధోనీ మూడు సార్లు కూడా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన ధోని
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొహాలి వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వేదిక మారింది కానీ టాస్‌లో ఫలితం మాత్రం మారలేదు. భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టు వరుసగా టాస్ ఓటమి పాలవ్వడం ఇది ఏడో సారి.
ఈ సిరిస్ లో ఇప్పటివరకూ ఇండియా టాస్ ఓడిపోవడమన్నది జరగలేదు. ఈ మ్యాచ్ లో కూడా టాస్ ఇండియానే వరించింది. తొలి రెండు మ్యాచ్ లలో తొలుత ఫీల్డింగ్ చేయాలని ఎంచుకున్న భారత్, మొదటి మ్యాచ్ లో విజయం సాధించి, ఆపై రెండో మ్యాచ్ లో స్వల్ప తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

కాగా, న్యూజిలాండ్ జట్టు మాత్రం ఒక మార్పుతో బరిలోగి దిగుతుంది. డెవిచ్ స్థానంలో నీషామ్‌ను తుది జట్టులోకి వచ్చాడు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఢిల్లీ వన్డేలో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుండగా, భారత్ మాత్రం న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌లో ముందంజ వేయాలని యోచిస్తోంది.
రెండో వన్డేలో గెలుపు న్యూజిలాండ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సిరిస్‌లో 1-1 తేడాతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పైచేయి సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. కాగా, ఈ వన్డేలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని సాధించనున్నాడు.

మరో మైలురాయికి చేరువలో కెప్టెన్ ధోని
మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధోని 22 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో 9000 పరుగుల మైలురాయికి చేరుకుంటాడు. 35 ఏళ్ల ధోని భారత్ తరుపున 280 వన్డేలాడి 8,978 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
వన్డేలో ధోని 9000 పరుగుల మైలురాయిని అందుకుంటే ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎలైట్ గ్రూపులో ధోని చేరతాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, అజారుద్దీన్ తర్వాత 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా చూస్తే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న 17వ బ్యాట్స్ మెన్.
మొహాలిలో భారత్‌కు మెరుగైన రికార్డు
మొహాలీలో భారత్ మెరుగైన రికార్డును కలిగి ఉంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ మొత్తం 13 వన్డేలు ఆడగా, 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ విజయం సాధించింది.
జట్లు:
భారత్: ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ