మరోసారి విరుచుకుపడ్డ అయ్యర్.. రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్.. రెండో టీ20లో భారత్ ఘన విజయం!!

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) మరోసారి రెచ్చిపోవడంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో టీమ్ సౌతీ రెండు వికెట్లు సాధించాడు.

ఆదిలోనే భారీ షాక్:
స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) మరోసారి త్వరగానే పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్లోనే టీమ్ సౌతీ బౌలింగ్‌లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. ఆపై లోకేశ్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. కోహ్లీ అండతో రాహుల్ పరుగులు చేసాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకునడిపాడు.

రాహుల్ హాఫ్ సెంచరీ:
కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఆరో ఓవర్ రెండో బంతికి సౌతీ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఔట్ అయినా.. రాహుల్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మొదటగా స్లోగా బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఆపై రెచ్చిపోయాడు. మరోవైపు రాహుల్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు. 16వ ఓవర్లో అయ్యర్ వరుసగా సిక్స్, ఫోర్ బాది టీమిండియాను లక్ష్యానికి చేరువ చేసాడు.

సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేసిన దూబే:
17వ ఓవర్ రెండో బంతికి మరో సిక్స్ బాదిన అయ్యర్.. ఆ తర్వాత బంతికి మరో భారీ షాట్ ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అయ్యర్ ఔట్ అయ్యే సమయానికి భారత్ విజయానికి కేవలం 8 పరుగులే కావాలి. శ్రేయాస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే (8 నాటౌట్).. సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, సోదీ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. హామిల్టన్ వేదికగా బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

జడేజా మాయ:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోరుకే టీమిండియా బౌలర్లు కట్టడి చేసారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో (26), సీఫెర్ట్ (33 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు.. శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, దూబే చెరో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications