రెండో వన్డేలో పోరాడిన జడేజా, సైనీ.. భారత్‌కు తప్పని పరాభవం.. సిరీస్ కివీస్ కైవసం!!

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది.

తడబడ్డ మాయంక్
న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు ధాటిగా ఆరంభించారు. బెన్నెట్ వేసిన తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్ని పృథ్వీ షా ఫోర్లు కొట్టి మంచి ఊపులో కనిపించగా.. మాయంక్ మాత్రం తడబడ్డాడు. సౌథీ వేసిన రెండో ఓవర్‌లో షా మరో బౌండరీ బాది స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. బెన్నెట్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి అగర్వాల్ ఔట్ అయ్యాడు. లైన్ లెంగ్త్ బంతికి స్లిప్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 21 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్‌ను కోల్పోయింది.

షా, కోహ్లీ క్లీన్ బోల్డ్:
ఇక అరంగేట్ర బౌలర్ కైల్ జెమీసన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా బౌల్డ్ కావడంతో.. భారత్ 34 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడారు. చెత్త బంతులను బౌండరీలకి పంపి స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేసారు. అయితే సౌథీ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ (15) క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగియకముందే టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది.

తొలి ఓవర్లోనే షాకిచ్చిన గ్రాండ్‌హోమ్:
ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడాడు. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ నాలుగు బౌండరీలు బాదాడు. అయితే మరోవైపు క్రీజులో ఉన్న లోకేష్ రాహుల్ తడబడి వికెట్ సమర్పించుకున్నాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ తన తొలి ఓవర్లోనే రాహుల్ (4)ను బోల్డ్ చేసాడు. కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. కేదార్ జాదవ్ అండతో అయ్యర్ కొంతసేపు స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు.

సైనీ మెరుపులు
ఆదినుంచి తడబడుతూ వచ్చిన జాదవ్.. 9 పరుగులు మాత్రమే చేసి సౌతీ బౌలింగ్‌లో నికోలస్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్ (52) కూడా బెన్నెట్ బౌలింగ్‌లో కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఠాకూర్ (18) కూడా త్వరగానే నిష్క్రమించాడు. ఇక టీమిండియా ఓటమి ఖాయం అనుకున్న సమయంలో జడేజా, సైనీలు అద్భుతంగా ఆడారు. బౌండరీలు బాదుతూ టీమిండియాను లక్ష్యం వైపు నడిపించారు. ఫోర్లు, సిక్సర్లతో 45 పరుగులు చేసిన సైనీ.. జేమిసన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పోరాడిన జడేజా:
ఉత్కంఠ పోరులో జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. చహల్ అండతో జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేసాడు. కానీ.. అనుకోకుండా చహల్ (10) రనౌట్ అవ్వడంతో మరింత ఉత్కంఠ రేగింది. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో జడేజా 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నీషమ్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్‌కు చిక్కడంతో టీమిండియా బ్యాటింగ్‌కు తెరపడింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్, టిమ్ సౌతీ, జెమిసన్, డీ గ్రాండ్‌హోమ్ తలో రెండు వికెట్లు తీశారు.

టేలర్ సూపర్ ఇన్నింగ్స్:
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా.. బ్లండెల్ (22), జెమీసన్ (25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications