హైదరాబాద్: పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 230 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. రెండు జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం. దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమమైంది.
సిరిస్ ఫలితం తేల్చే మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (7)ను వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ధావన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడారు.
ఈ క్రమంలో జట్టు స్కోరు 79 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (29) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి శిఖర్ ధావన్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో ధావన్ వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనతంరం ధావన్ (68) పరుగులు వద్ద అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యాతో కలిసి దినేశ్ కార్తీక్ వన్డేల్లో 9వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాటిగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా (30) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి దినేశ్ కార్తీక్ భారత్‌కు విజయాన్ని అందించాడు. దినేశ్ కార్తీక్ (64), ధోనీ (18) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి కివీస్ బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేసిన భువనేశ్వర్ కుమార్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
పాండ్యా అవుట్: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 204 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా (30) పరుగుల వద్ద మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఆడమ్ మిల్నేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పాండ్యా అవుటైన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం కార్తీక్ 60, ధోని 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీ
పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 76 బంతులను ఎదుర్కొన్న కార్తీక్ 3 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం 40 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
ధావన్ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ధావన్ (68) మిల్నె బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దినేశ్ కార్తీక్ 30, హార్ధిక్ పాండ్యా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 86 పరుగులు కావాలి.
ధావన్ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన నెమ్మదిగా చేధిస్తోంది. ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ధావన్ 5 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. తొలి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన ధావన్ ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్ 51, కార్తీక్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 117 పరుగులు కావాలి.

కోహ్లీ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు స్కోరు 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులు చేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ 37, దినేశ్ కార్తీక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లకు భారత్ స్కోరు 64/1
పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్ 28, విరాట్ కోహ్లీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 22 పరుగుల వద్ద రోహిత్ శర్మ (7) సౌథీ బౌలింగ్‌లో మున్రోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. జట్టు స్కోరు 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (7) మున్రోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 15, కెప్టెన్ కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్ విజయ లక్ష్యం 231
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఆరంభం నుంచీ తడబడుతూనే ఆడింది.
20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనీయలేదు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో మార్టిన్ గుప్తిల్ (11), కోలిన్ మున్‌రో (10), విలియమ్సన్ (3), టైలర్ (21), టామ్ లాథమ్ (38), హెన్రీ నికోల్స్ (42), గ్రాండ్‌హోమ్(41), ఆడమ్ మిల్నే(0), శాంట్నర్ (29), టిమ్ సౌతీ (25), ట్రెంట్ బౌల్ట్ (2) పరుగులు చేశారు.
ఇక, భారత బౌలర్లలో భువీ 3 వికెట్లు తీయగా, యజ్వేంద్ర చాహల్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ తడబడుతోంది. ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో వరుసగా గ్రాండ్ హోమ్ (41), ఆడమ్ మిల్నే(0)ల వికెట్లను కోల్పోయింది. దీంతో 44 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, యజువేంద్ర చాహల్ 2, బుమ్రా, పాండ్యా, అక్షర పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 165 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హెన్రీ నిఖోల్స్ (42) పరుగుల అవుటయ్యాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 40 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం గ్రాండ్‌హోమ్ 37, మిచెల్ శాంట్నర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 118 పరుగుల వద్ద లాథమ్ (38) బౌలర్ అక్షర పటేల్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 30 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. లాథమ్ అవుటైన తర్వాత కోలిన్ డి గ్రాండ్‌హోమ్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం హెన్రీ నిఖోల్స్ 30, గ్రాండ్‌హోమ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
100 పరుగుల మార్క్‌ని అందుకున్న కివీస్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 25 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 31, హెన్రీ నిఖోల్స్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
టేలర్ అవుట్: నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాస్ టేలర్ (21) వద్ద ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 16 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్ 12, హెన్రీ 4 పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్‌లో ఓపెనర్ గుప్టిల్ (11) అవుట్ చేసిన భువీ... ఆరో ఓవర్ చివరి బంతికి మన్రో (17)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. రాస్ టేలర్ 11, లాథమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విలియమ్సన్ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన కివీస్
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 25 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. విలియమ్సన్ అవుటైన తర్వాత క్రీజులోకి రాస్ టేలర్ వచ్చాడు.
గుప్టిల్ అవుట్: తొలి వికెట్ కోల్పోయిన కివీస్
పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ మూడో ఓవర్లోనే కీలకమైన వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 2.4 ఓవర్ బంతికి కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (11) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చిన పెవిలియన్‌కు చేరాడు. దీంతో 3 ఓవర్లకు గాను కివీస్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మున్రో 8, కేన్ విలియమ్సన్ 1 పరుగుతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. గత ఆదివారం వాంఖడెలో ముగిసిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్ రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇందులో భాగంగా తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే న్యూజిలాండ్ బరిలోకి దిగింది. మరోవైపు వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన ఈ మూడు వన్డేల సిరీస్‌ను సొంతగడ్డపై ఎట్టిపరిస్థితిలోనూ చేజార్చుకోకూడదనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది.
కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇది 100వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.
జట్ల వివరాలు:
న్యూజిలాండ్:
మార్టిన్ గుప్తిల్, కాలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, కాలిన్ గ్రాండ్‌హోమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్
ఇండియా:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్, కేదార్ జాదవ్, ధోనీ, హర్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, బుమ్రా, యజ్వేంద్ర చాహల్