ఆరంభంలోనే టీమిండియాకు షాక్.. మయాంక్, షా, కోహ్లీ, రాహుల్ ఔట్!!

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో చేధనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 10 ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వికెట్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను కూడా కోల్పోయింది. కివీస్ పేసర్లు టిమ్ సౌథీ, హమిష్ బెన్నెట్, కైల్ జెమీసన్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించారు.

తడబడ్డ మాయంక్:
న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు ధాటిగా ఆరంభించారు. బెన్నెట్ వేసిన తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్ని పృథ్వీ షా ఫోర్లు కొట్టి మంచి ఊపులో కనిపించగా.. మాయంక్ మాత్రం తడబడ్డాడు. సౌథీ వేసిన రెండో ఓవర్‌లో షా మరో బౌండరీ బాది స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. బెన్నెట్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి అగర్వాల్ ఔట్ అయ్యాడు. లైన్ లెంగ్త్ బంతికి స్లిప్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 21 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్‌ను కోల్పోయింది.

షా, కోహ్లీ క్లీన్ బోల్డ్:
ఇక అరంగేట్ర బౌలర్ కైల్ జెమీసన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా బౌల్డ్ కావడంతో.. భారత్ 34 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడారు. చెత్త బంతులను బౌండరీలకి పంపి స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేసారు. అయితే సౌథీ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ (15) క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగియకముందే టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది.

తొలి ఓవర్లోనే షాకిచ్చిన గ్రాండ్‌హోమ్:
ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడాడు. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ నాలుగు బౌండరీలు బాదాడు. అయితే మరోవైపు క్రీజులో ఉన్న లోకేష్ రాహుల్ తడబడి వికెట్ సమర్పించుకున్నాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ తన తొలి ఓవర్లోనే రాహుల్ (4)ను బోల్డ్ చేసాడు. కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్‌లో అయ్యర్ (26), కేదార్ జాదవ్ (0) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 199 పరుగులు అవసరం.

టేలర్ మెరుపులు:
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా.. బ్లండెల్ (22), జెమీసన్ (25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications