ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫెయిల్..
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టుతో జులై1వ తేదీన టెస్ట్ మ్యాచ్‌ను ఆడనుంది. దీనికి ముందుగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియా చెత్త బ్యాటింగ్‌కు అద్దం పట్టింది. చాలాకాలం తరువాత ఇంగ్లాండ్ గడ్డపై అంచనాలకు భిన్నంగా, నిరుత్సాహ పరిచేలా బ్యాటింగ్ కొనసాగుతోంది. రోహిత్ శర్మ సహా బ్యాటర్లెవరూ భారీ స్కోర్‌ను చేయలేక చేతులెత్తేశారు.
బ్యాటింగ్ లైనప్ బలహీనం..
తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. వైజాగ్ క్రికెటర్ కేఎస్ భరత్-70, టెయిలెండర్ బ్యాటర్ మహ్మద్ షమీ-18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ-25, శుభ్‌మన్ గిల్-21, హనుమ విహారి-9, విరాట్ కోహ్లీ-33, శ్రేయాస్ అయ్యర్-0, రవీంద్ర జడేజ-13, శార్దుల్ ఠాకూర్-6, ఉమేష్ యాదవ్-23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరందరు చేసిన పరుగుల కంటే లీసెస్టర్‌షైర్ బౌలర్లు ఇచ్చిన ఎక్స్‌ట్రాలే అధికం. ఏకంగా 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు.
ఆదుకున్న వైజాగ్ కుర్రాడు..
కాగా- ఈ మ్యాచ్‌లో తొలి రోజే కేఎస్ భరత్ విజృంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 111 బంతులను ఎదుర్కొన్న ఈ వైజాగ్ క్రికెటర్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇవ్వాళ మళ్లీ తన ఆటను కొనసాగించనున్నాడు. సెంచరీ బాదేయడం ఖాయంగా కనిపిస్తోంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన కేఎస్ భరత్.. సమయోచితంగా ఆడాడు. ఏ బంతిని ఎలా ఆడాడో.. అచ్చంగా అలాగే ఆడాడు. నాణ్యమైన టెస్ట్ క్రికెటర్ అనిపించుకున్నాడు.
రిషభ్ కష్టాలు పెంచిన భరత్..
ఇది కాస్తా- వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టినట్టయింది. ప్రస్తుతం పంత్.. ఫామ్‌లో ఉండట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నమెంట్ నుంచీ అతను విఫలమౌతూనే వస్తోన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఫెయిల్యూర్స్ అతన్ని వెంటాడాయి. వర్షం వల్ల రద్దయిన బెంగళూరు మ్యాచ్‌తో కూడా కలుపుకొని అయిదింట్లో అతను చేసింది 58 పరుగులే. బెంగళూరులో జరిగిన అయిదో టీ20 మ్యాచ్‌లో వర్షం పడే సమయానికి రిషభ్ పంత ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.
దినేష్ కార్తీక్ నుంచి పోటీ..
రిషభ్ పంత్‌కు ప్రస్తుతం దినేష్ కార్తీక్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోన్నాడు. దినేష్ కార్తీక్ కూడా వికెట్ కీపరే కావడం.. పైగా అటు ఐపీఎల్‌లో, ఇటు దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ అద్భుతంగా ఆడటం దీనికి కారణం. పలువురు మాజీ క్రికెటర్లు రిషభ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో వికెట్ కీపరే అయిన కేఎస్ భరత్ కూడా ఫామ్‌లో ఉండటం పంత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టినట్టయింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భరత్ గనక సెంచరీ పూర్తి చేసుకుంటే.. తొలి టెస్ట్‌లో అతనికి స్థానం దక్కుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.


Click it and Unblock the Notifications












