

హైదరాబాద్: ఐర్లాండ్ పర్యటనను విజయంతో ఆరంభించడం ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రెండు టీ20ల సిరిస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 76 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలి టీ20లో రోహిత్ శర్మ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం (జూన్ 29)న డబ్లిన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "ఐర్లాండ్ పర్యటనను విజయంతో ఆరంభించడం ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నాడు.
"త్వరలో టీమిండియా ఐర్లాండ్ పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటన సవాలుతో కూడుకున్నది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో ఆడటంతో మంచి సన్నాహకంగా ఉంది. రెండో టీ20లో కూడా మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. గెలుపు ఎప్పుడైనా మనలో ఆత్మవిశ్వాసం నింపుతుంది" అని రోహిత్ శర్మ అన్నాడు.
ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరుపున ఆడుతుండటం సంతోషంగా ఉందని అన్నాడు. తొలి టీ20లో ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు చక్కటి భాగస్వామ్యం నెలకొల్పామని తెలిపాడు.
దీంతో ఆ మ్యాచ్‌లో విజయం సాధించామని, అయితే ఫీల్డింగ్‌లో కొన్ని అనవసర తప్పిదాలు చేస్తున్నామని అన్నాడు. నిజానికి మన స్థాయికి తగ్గట్టు ఫీల్డింగ్ ప్రదర్శన లేదని రోహిత్ శర్మ తెలిపాడు. రెండో టీ20లో బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇస్తామని కెప్టెన్ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే.