
హైదరాబాద్: ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లోనూ విభిన్నంగా కనిపించే విరాట్ కోహ్లీ.. మిస్టర్ ఫిట్‌నెస్‌గా పేరొందిన కెప్టెన్‌కు వెన్నునొప్పి ఆటంకంగా మారింది. కీలక మ్యాచ్ అయిన మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో తన సత్తా చాటలేకపోయాడు. భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టులో భాగంగా లార్డ్స్ టెస్టు రెండో రోజే వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ అతను ఫీల్డింగ్‌లో పూర్తి సమయం మైదానంలో ఉండలేకపోయాడు. ఆదివారం కూడా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం 37 నిమిషాల పాటు కోహ్లి ఫీల్డ్‌కు రాలేదు.
నిబంధనల ప్రకారం కోహ్లీ.. కాస్త ఆలస్యంగా క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది. అందుకే రహానేను ముందు పంపి బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ ఐదో స్థానంలో వచ్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కూడా సాధారణంగా ఎప్పుడూ కనిపించే చురుకుదనం, పట్టుదల కొద్దిగా మందకొడిగా కనిపించాయి. గ్రౌండ్‌లో ఉన్న కాసేపటి సమయంలోనే వెన్ను నొప్పికి చికిత్స చేయించుకొని ట్యాబ్లెట్‌లు వేసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నిదానంగా కొనసాగించాడు.
చివరకి కరన్ బౌలింగ్‌లో ఇబ్బందిగా సింగిల్ తీసి, తర్వాతి బంతికే రెండో పరుగును అతి కష్టం మీద పూర్తి చేసినప్పుడే సమస్య తీవ్రంగా ఉందని అర్థమైంది. చివరకు అన్‌ఫిట్‌గా నిలిచిన విరాట్ కోహ్లి ఔట్‌తోనే భారత్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. ముందుగా బ్రాడ్ ఓవర్లో బంతి బ్యాట్‌కు తగిన కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు భావించి ఇంగ్లండ్ రివ్యూ చేసినా ఫలితం విరాట్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే తర్వాతి బంతికే షార్ట్‌లెగ్‌లో ఫీల్డర్ అందుకున్న క్యాచ్‌ను అంపైర్ దార్ ఔట్‌గా ప్రకటించాడు.
వెంటనే కోహ్లి రివ్యూ చేసినా... బంతి అతని గ్లవ్‌కు తాకి వెళ్లినట్లు స్పష్టం కావడంతో వెనుదిరగక తప్పలేదు. ఆగష్టు 18 నుంచి జరగనున్న తర్వాతి టెస్టుకు చాలా విరామం ఉండడంతో.. కోహ్లీ త్వరగా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను అందుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మరో వైపు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్ చేతి వేళ్లకు కూడా రెండు సార్లు గాయమైంది. బ్రాడ్, వోక్స్ బౌలింగ్‌లలో దెబ్బలు తగలడంతో నొప్పిని తట్టుకోలేక అశ్విన్ కూడా చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.