వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పేలవమైన వ్యూహాలతో టీమిండియాను రెండో టెస్టులోనూ ప్రమాదంలోకి నెట్టారని నెట్టింట్లో వాదనలు వినిపిస్తున్నాయి.
దేశవాళీ క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం అన్యాయమని నెటిజన్లు అంటున్నారు. సర్ఫరాజ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టి ముకేశ్ కుమార్‌ను తీసుకోవడం క్రికెట్ విశ్లేషకులకు ఆశ్చర్చానికి గురిచేసింది.

విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమవ్వడంతో భారత్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపిస్తోంది.అంతేగాక శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ లేకపోవడం టీమిండియాకు ప్రతికూలాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో వస్తాడని భావించారంతా. అతడు బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. కానీ టీమిండియా ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. బుమ్రాతో ముకేశ్ కుమార్‌ను తీసుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి టెస్టు తరహాలోనే ఒకే ఫాస్ట్ బౌలర్‌తో రెండో టెస్టు ఆడుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైజాగ్ వికెట్ కూడా స్పిన్‌కు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. టీమిండియా కంటే ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ పిచ్‌ను గొప్పగా అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. కాగా, మహ్మద్ సిరాజ్ జట్టు నుంచి వెళ్లిపోయాడు. విశ్రాంతి ఇస్తూ బీసీసీఐ అతడిని రిలీజ్ చేసింది.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్