
హైదరాబాద్: "నాలుగో టెస్టు గెలవడానికి వ్యూహాలు రచించాం. వరుసగా రెండు టెస్టుల ఓటమి అనంతరం మూడో టెస్టు గెలవడానికి చాలా కష్టపడ్డాం" నాలుగో టెస్టు ఆరంభానికి ముందు మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన మాటలివి.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కోహ్లీసేన ఇంగ్లీషు గడ్డపై నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన కోహ్లీసేన అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీసేన 1-2తేడాతో వెనుకంజలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. నాలుగో టెస్టుకు వేదికైన రోస్ బౌల్ స్టేడియంలో భారత్‌కు ఇది మూడో మ్యాచ్. గతంలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్‌దే విజయం. దీంతో ఆ రికార్డును బ్రేక్ చేసి సిరీస్‌ను సమం చేయాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు.
నాలుగో టెస్టు సన్నద్దతపై మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "నాలుగో టెస్టు గెలవడానికి వ్యూహాలు రచించాం. వరుసగా రెండు టెస్టుల ఓటమి అనంతరం మూడో టెస్టు గెలవడానికి చాలా కష్టపడ్డాం. అయితే నాటింగ్‌హామ్‌లో కష్టపడినదానికంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడితే సౌతాంప్టన్‌లోనూ గెలిచి సిరీస్ సమం చేస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది" అని చెప్పాడు.
"నాలుగో టెస్టులో గెలిచి తీరుతాం. గత మ్యాచ్ ఓటమితో ఆతిథ్య జట్టుపై కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. వారు మరింత ఆటాకింగ్ గేమ్ ఆడే అవకాశం ఉంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక్కడే సిరీస్ సమం చేస్తాం. మన పేస్ బౌలర్ల ప్రదర్శణ అద్భుతంగా ఉంది. ఈ పిచ్ పరిస్థితి చూస్తుంటే నాలుగో ఇన్నింగ్స్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు మైదానాన్ని మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం" అని కోహ్లీ తెలిపాడు.