
రొటేషన్ విధానం మంచిదే:
తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'కఠినమైన బయో బబుల్‌లో ఉండడం వల్ల ఆటగాళ్లకు విసుగు రావొచ్చు. అంతేకాదు ఉత్సాహం కోల్పోయే అవకాశం ఉంది. ఏ ఫార్మాట్లోనైనా రొటేషన్ విధానం మంచిదే. ఏ క్రికెటర్ కూడా ఏడాది ఆసాంతం మ్యాచ్‌లు ఆడుతూనే ఉండలేడు. అందులోనూ బయో బబుల్‌లో అంటే కష్టం. ప్రతి ఒక్కరికీ విరామం అవసరం. బయో బబుల్‌లో ఉన్నప్పుడు ఆటగాళ్ల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లు మానసికంగా అలసిపోయే అవకాశముంది' అని అన్నాడు.

రిజర్వ్ బెంచ్ ఉంటే:
మంచి రిజర్వ్ బెంచ్ ఉంటే రొటేషన్ విధానం విజయవంతం అవుతుందని, ఈ విషయంలో టీమిండియాకు ఎలాంటి చింత అవసరం లేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. 'భారత్‌ను టెస్టు లేదా వన్డే లేదా టీ20 మ్యాచ్‌లో గెలిపించేందుకు మరో 11 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తు పట్ల చాలా స్పష్టతతో ఉన్నాం. వచ్చే అయిదేళ్లలో ఏం చేయాలనే ప్రణాళిక మా వద్ద ఉంది. కాబట్టి పాత ఆటగాళ్లు నిష్క్రమించి, కొత్త ఆటగాళ్లు వచ్చినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు' అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

సెంచరీ చేయలేదనే బాధ లేదు:
'చాలా రోజులుగా సెంచరీ చేయలేదనే బాధ లేదు. ఎందుకంటే ఓ బ్యాట్స్‌మన్‌గా నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఎలా ఆడుతున్నానో, జట్టులో నా బాధ్యత ఏంటో బాగా తెలుసు. వ్యక్తిగత మైలురాళ్లు అందుకున్నప్పుడు జట్టు ప్రదర్శన బాగా లేకుంటే విమర్శకులు నా కెప్టెన్సీని తప్పుబడుతారు. ఒకవేళ జట్టు బాగా ఆడుతూ, బ్యాట్స్‌మన్‌గా నేను రాణించనప్పుడు వ్యక్తిగత పరుగులపై మాట్లాడుతారు. కాబట్టి నాకు ఇది ఎప్పటికే ఉండే సమస్యేనే' అని విరాట్ పేర్కొన్నాడు.

15 నెలలుగా:
2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆపై ఇప్పటివరకూ మరో శతకం సాధించలేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాత మూడు ఫార్మాట్లలో కలిపి 35 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటన ఫస్ట్ టెస్ట్‌లో 72 పరుగులు చేసిన విరాట్ దాన్ని సెంచరీగా మలచలేకపోయాడు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులే చేశాడు.