టీమిండియాకు బిగ్ షాక్. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొత్తానికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరమయ్యాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం భారత నియంత్రణ క్రికెట్ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీకి కోహ్లి స్వయంగా తెలియజేశాడని సమాచారం. చివరి మూడు టెస్టుల ఎంపిక గురించి ఆన్‌లైన్‌లో సెలక్లర్లు సమావేశమవ్వగా కోహ్లి తన గురించి క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఆరంభ మ్యాచ్ కోసం కోహ్లి హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. కానీ అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. మరోవైపు కోహ్లి స్థానంలో రజత్ పటిదార్ జట్టులోకి వచ్చాడు. ఉప్పల్ టెస్టులో తుదిజట్టులో చోటు దక్కకపోయినా రెండో టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు.

స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లి పాల్గొనకపోవడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి. కోహ్లితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడని తెలుస్తోంది. వెన్నుగాయం తిరగబెట్టడం, ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు గజ్జల్లో నొప్పివస్తుండటంతో అతడికి విశ్రాంతి ఇచ్చారని సమాచారం. రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టు బుమ్రా అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
మరోవైపు తొలి టెస్టులో గాయపడి వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండనున్నారు. అయితే సెలక్టర్లు ఓ యువ బౌలర్‌పై మొగ్గుచూపుతున్నారు.ఆకాశ్‌దీప్‌కు అవకాశం ఇవ్వనున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆకాశ్ సత్తాచాటాడు. అవేశ్‌ఖాన్‌ను పక్కనపెట్టి ఆకాశ్‌కు ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.
కాగా, అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.