ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. అయితే టీమిండియా దాదాపు అయిదేళ్ల తర్వాత టెస్టు క్రికెట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైభవంగా సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చార్మినార్‌ను చూపిస్తూ ప్రారంభమైన ఈ వీడియోలో ఉప్పల్‌లో భారత్ సాధించిన టెస్టు విజయాలను గ్రాండ్‌గా చూపించింది. ఉప్పల్ టీమిండియా విజయాల అడ్డా అంటూ సాధించిన రికార్డులు వీడియోలో పేర్కొంది.

ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు అయిదు టెస్టులు ఆడగా, నాలుగింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2010లో ఉప్పల్‌లో టీమిండియా తొలిసారిగా టెస్టు ఆడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, ఈ టెస్టులో హర్భజన్ సింగ్ అజేయంగా 111 పరుగులు సాధించడం విశేషం. సెహ్వాగ్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు కోసం భారత జట్టు మరోసారి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌పై ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెతేశ్వర్ పుజారా 159 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో సత్తాచాటాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా విజయభేరి మోగించింది. ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో పుజారా (204) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
అలాగే 2017లో బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడిన ఏకైక టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (204) ద్విశతకంతో చెలరేగాడు. ఇక, ఉప్పల్ వేదికగా 2018లో వెస్టిండీస్‌తో ఆడిన టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పంత్ (92) సెంచరీ మిస్ అయ్యాడు. కాగా, ఉప్పల్‌లో జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో అశ్విన్ భారత జట్టులో ఉన్నాడు.
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ (దూరం), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ , రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్