
చెన్నై: భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లోని నాలుగు టెస్టులకు గాను అంపైరింగ్ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్యానెల్లోని ముగ్గురు భారత అంపైర్లే నిర్వహించనున్నారు. ఇందులో ఇద్దరు అంపైర్లు టెస్టుల్లో తొలిసారి విధులు నిర్వహించనున్నారు. ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయనున్నారు. వీరితో పాటు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ కూడా అంపైరింగ్ చేయనున్నారు. నితిన్‌కు గతంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణ సమస్యలు ఉండటంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌సిప్‌లో స్థానిక అంపైర్లనే నియమించే అవకాశంను ఐసీసీ కల్పించింది. దీంతో ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన మహిళ అంపైర్ తొలిసారి విధులు నిర్వర్తించారు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు భారత అంపైర్లకు ఊహించని అవకాశం దక్కింది. వాస్తవానికి ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భారత్ నుంచి ఒకే అంపైర్ ఉన్నారు. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ అంపైర్లలో నితిన్ మీననే సీనియర్.
నితిన్ మీనన్ ఇప్పటికే మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ చేశాడు. వీరేందర్ శర్మకి కేవలం రెండు వన్డేలు, ఒక టీ20కి అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది. ఇక అనిల్ చౌదరి 20 వన్డేలు, 28 టీ20ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. మొత్తానికి టెస్ట్ చాంపియన్‌సిప్‌లో స్థానిక అంపైర్లనే నియమించే అవకాశం ఐసీసీ ఇవ్వడం మనోళ్లకు కలిసొచ్చింది.
ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి భారత ఆటగాళ్లు సాధన మొదలుపెడతారు. ఈ టెస్టుల కోసం ఇప్పటికే ఇంగ్లండ్, భారత జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకొని.. అక్కడి లీలా ప్యాలేస్ హోటల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటున్నారు. క్వారంటైన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంది. దీంతో ఈ సమయాన్ని అందరూ తమ ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు.