కోహ్లీసేన బెస్ట్ ట్రావెలింగ్ టీమ్: రవిశాస్త్రి వ్యాఖ్యలపై గంగూలీ మండిపాటు

హైదరాబాద్: భారత జట్టులో గతంలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న జట్టులా అతి తక్కువ సమయంలో అత్యధిక విజయాలను సాధించలేదంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మండిపడ్డాడు.
"రవిశాస్త్రి అపరిపక్వంతో ఈ వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత మాజీ క్రికెటర్లు అయిన చేతన్ శర్మ, నేను, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాళ్లం భారత్ తరఫున ఆడాం. అన్ని తరాల వాళ్లం దేశం కోసమే ఆడాం" అని గంగూలీ చెప్పాడు.
"ఇప్పుడు అలాగే కోహ్లీ ఆడుతున్నాడు. అందరం టీమిండియాకు చెందిన వాళ్లమే. ఆయా సమయాల్లో మేమందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఆడాం. ఒక తరంతో మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడడం సరికాదు. నేను కూడా చాలా మాట్లాడగలను. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు" అని గంగూలీ అన్నాడు.

1-3తో సిరిస్ ను చేజార్చుకున్న టీమిండియా
ఇటీవల నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఒక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు సైతం పెదవి విరిచారు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్ ఇలా వరుసగా విఫలమవుతుంటే? హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఏం చేస్తున్నారు అంటూ మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఐదు టెస్టు ప్రారంభానికి ముందు రవిశాస్త్రి మాట్లాడుతూ
ఈ విమర్శలపై ఐదు టెస్టు ప్రారంభానికి ముందు రవిశాస్త్రి మాట్లాడుతూ "గత మూడేళ్లుగా భారత్ జట్టు ఓవర్‌సీస్‌లో తొమ్మిది టెస్టుల్లో గెలుపొందింది. అలానే విండీస్‌తో ఒకటి, శ్రీలంకపై రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ విజయం సాధించింది. గత 15-20ఏళ్ల కాలంలో దిగ్గజ క్రికెటర్లు జట్టులో ఉన్నప్పటికీ ఏ భారత్ జట్టు ఈ విజయాల్ని అందుకోలేకపోయింది. ఈ గణాంకాలే వాస్తవాన్ని చెబుతాయి. కాబట్టి.. ఆ జట్లతో పోలిస్తే ప్రస్తుత ఉన్న జట్టు మెరుగని నిరూపించాం" అని శాస్త్రి అన్నాడు.

శాస్త్రి వ్యాఖ్యలపై మండిపడుతోన్న మాజీ క్రికెటర్లు
రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ సైతం మండిపడ్డాడు. "విదేశాల్లో మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదని చెప్పగలను. 1980వ దశకంలోనే భారత జట్టు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల్లో గెలిచాయి. అంతేకాదు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్ గెలిచాం" అని గవాస్కర్ పేర్కొన్నాడు.

ద్రవిడ్‌కు రావాల్సిన పేరు రాలేదు: గవాస్కర్
ఇంగ్లండ్‌లో చివరిసారి 2007లో ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సిరీస్ గెలిచింది. అయితే అప్పట్లో ద్రవిడ్‌కు రావాల్సిన పేరు రాలేదని గవాస్కర్ అన్నాడు. "ద్రవిడ్ కెప్టెన్సీలో 2005లో విండీస్‌లో, 2007లో ఇంగ్లండ్‌లో భారత్ సిరీస్‌లు నెగ్గింది. అంతేకాదు అతడి సారథ్యంలోనే తొలిసారి దక్షిణాఫ్రికాను వారి దేశంలో భారత్ ఓడించింది. కానీ ఆ విజయాల్లో ద్రావిడ్‌కు అంతగా పేరు రాలేదు. ఏదేమైనా విదేశాల్లో సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత జట్లూ ఉన్నాయి" అని గవాస్కర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications