టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 23 పరుగులకే ఔటయ్యాడు. టామ్ హర్టీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి డకెట్ చేతికి చిక్కాడు. ఏకాగ్రత కోల్పోయి గిల్ ఆ షాట్ ఆడినట్లు వ్యాఖ్యాతలు పేర్కొనడం గమనార్హం.
అంతకుముందే గిల్‌కు లైఫ్ లభించింది. 16 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో క్రీజు బయటికి వచ్చి భారీషాట్‌కు యత్నించాడు. కానీ అది బ్యాట్‌కు సరిగా కనెక్ట్ కాలేదు. అయితే సూర్యుడి ఎఫెక్ట్‌తో బెన్ స్టోక్స్‌కు గాల్లో బంతి కనిపించలేదు. దీంతో స్టోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత కూడా గిల్ జాగ్రత్తగా ఆడలేకపోయాడు. 66 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు బౌండరీలు మాత్రమే సాధించగలిగాడు.

ఈ నేపథ్యంలో గిల్‌పై నెటింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, ఇప్పటికైనా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్లు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. గత పది ఇన్నింగ్స్‌ల్లో
20 కంటే తక్కువతో గిల్ పరుగులు చేస్తున్నాడని, ఇక గిల్ ప్లేస్ పోయినట్లే అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, మరోవైపు ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోరు 119/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో జైశ్వాల్ రిట్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు 74 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (44*), శ్రేయస్ అయ్యర్ (18*) ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లిష్ బ్యాటర్లు విలవిలలాడారు. బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.