|
ఇంగ్లండ్ పిరికి క్రికెట్ ఆడింది:
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం 'అసలు మీ టీమ్‌లో ఏం జరుగుతోంది?' అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు షేన్ వార్న్ ట్వీట్ చేశాడు. 'మైకేల్ వాన్.. ఇంతకు మీ జట్టులో ఏం జరుగుతోంది?. వారేం చేస్తున్నారు?. దిశ దిశ లేకుండా ఆడుతున్నారా?, వారెందుకు బౌలింగ్ చేయడం లేదు?. రెండు ఇన్నింగ్స్‌ల్లో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన తర్వాత టీమిండియాకు బౌలింగ్ చేసి ఆలౌట్ చేయగలరా?. ఆస్ట్రేలియాలో టీమిండియా సాహసోపేత క్రికెట్ ఆడింది. అది చూడటానికి చాలా బాగుంది. ఆసీస్ గమ్యం లేకుండా రక్షణాత్మక క్రికెట్ ఆడి ఓడిపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అలానే ఆడుతోంది' అని వార్న్ ట్వీట్ చేశాడు.
|
ఎదో అలా కానివ్వండి:
'ఈ మ్యాచ్ ఓడిపోవద్దన్న వైఖరితోనే ఇంగ్లండ్ కనిపిస్తోంది. గెలిచేందుకు అత్యుత్తమ దారులు వెతక్కుండా, ఎన్ని ఓవర్లు అవసరమవుతాయో చూడకుండా ఆడుతోంది. ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయం ఆ జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లపై' అని షేన్ వార్న్ పేర్కొన్నాడు. వార్న్ ట్వీట్లపై మైకేల్ వాన్ స్పందించాడు. 'ఎదో అలా కానివ్వండి' అని ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా 'డిక్లేర్' అంటూ పెద్ద అక్షరాలతో ట్వీట్ చేయడం చేశాడు.

రోజు మొత్తం కోహ్లీసేన బ్యాటింగ్ చేయగలదు:
చెపాక్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఏడు సెషన్ల పాటు ఆడి 578 పరుగులు చేసింది. అప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకుంది. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే 241 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ భారత జట్టును ఫాలోఆన్ ఆడించలేదు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా వేగంగా 200 పరుగులు చేసిందా అంటే అదీ లేదు. ఒక గమ్యం, లక్ష్యం లేనట్టుగా ఆడింది. 47 ఓవర్లు ఆడి 178 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీసేనకు భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ.. మ్యాచును శాసించే స్థితిలో మాత్రం నిలవలేకపోయింది. ఒక రోజు మొత్తం కోహ్లీసేన బ్యాటింగ్ చేయగల అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే వేగంగా ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే బాగుండేదని షేన్ వార్న్ అభిప్రాయపడుతున్నాడు.

బంగ్లా పరిస్థితి రావొద్దని:
బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ ఆదివారం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 395 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛేదించి రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అయిదో అత్యధిక లక్ష్య ఛేదనగా నమోదు అయింది. తొలి టెస్టు ఆడుతున్న కైల్ మేయర్స్ డబుల్ సెంచరీ (210) చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. బంగ్లా పరిస్థితి తమకు రావొద్దని ఆలోచించి ఇంగ్లండ్ డిక్లేర్ చేయలేదని పలువురు అంటున్నారు.