టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. ఇక మిగిలిన బెర్తు కోసం భారత్-ఇంగ్లండ్ అమీతుమి తేల్చుకోనున్నాయి. గయానా వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే గ్రూప్ స్టేజ్, సూపర్-8 దశలో మ్యాచ్‌లను పోలిస్తే సెమీస్‌లో నిబంధనలు మారిపోయాయి. ఆ కొత్త రూల్స్ అన్నీ ఇంగ్లండ్ కొంపముంచేలా ఉన్నాయి.
అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ సెమీస్ ట్రిండాడ్ వేదికగా జరగాలి. కానీ గయానాకు వేదిక మారింది. వేదిక మార్పు గురించి ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ గయానాలో మ్యాచ్ సజావుగా జరిగే వాతావరణం కనిపించట్లేదు. సెమీస్‌కు వర్షం ముంపు పొంచి ఉంది.

మరోవైపు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్‌కు రిజర్వ్ డే కూడా లేదు. శనివారమే ఫైనల్ జరగనుండటంతో ఐసీసీ రిజర్వ్ డే కేటాయించలేదు. కానీ 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చింది. అయితే ప్రతికూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో.. గ్రూప్, సూపర్-8 దశలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి ఇరు జట్లు కనీసం అయిదు ఓవర్ల పాటు ఆట ఆడాలి. కానీ సెమీఫైనల్‌లో అలా కాదు. కనీసం ఓ జట్టు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. అప్పుడే మ్యాచ్ విజేతను నిర్ణయిస్తారు.
వరుణుడు తీవ్ర ప్రతాపం చూపిస్తే 10 ఓవర్ల పాటు ఆట కొనసాగడం కష్టమే. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇంగ్లండ్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఎందుకంటే సూపర్-8 దశలో ఇంగ్లండ్ (రెండో స్థానం) కంటే భారత్ (అగ్రస్థానం) మెరుగైన స్థానంలో ఉంది. ఇక రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అర్ధరాత్రి 12.10 గంటల వరకు ప్రారంభం కాకపోయినా నష్టమేమి లేదు. 20 ఓవర్ల పాటు ఇరు జట్లు ఆడే అవకాశం ఉంటుంది.
అప్పటికీ మ్యాచ్ ప్రారంభంకాకపోతే క్రమంగా ఓవర్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక అర్ధరాత్రి 1.44 నిమిషాలకు కూడా మ్యాచ్ మొదలుకాకపోతే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఆ సమయానికి ప్రారంభమైతేనే కనీసం 10 ఓవర్ల పాటు ఆట జరుగుతుంది.