
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు 20 రోజుల సెలవులు ముగిశాయి. విహార యాత్రలు ముగించుకొన్న ప్లేయర్స్ డుర్హమ్ చేరుకున్నారు. రివర్‌సైడ్ స్టేడియంలో సాధన మొదలు పెట్టారు. మైదానంలో పరుగెత్తుతూ, ఫుట్‌బాల్ ఆడుతూ, బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతున్నారు. క్రికెటర్లంతా తిరిగి ఒక్క చోటకు చేరడంతో భారత శిబిరం సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తమ ప్రాక్టీస్ మొదలైందంటూ పలు పోటోలను పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'భాయ్.. సెలవులు ముగిశాయి. ఇక పని మొదలు పెట్టాలి' అని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్‌కు సంబందించిన వ్యయం చేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను రోహిత్ పంచుకున్నాడు. 'తిరిగి శిబిరానికి చేరుకున్నాం' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, బూమ్బూమ్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో కలిసిన ఫొటో పెట్టాడు. 'హలో డుర్హమ్.. ఇక్కడికి రావడం బాగుంది' అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెట్టింది.
కరోనా వైరస్ సోకడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ డుర్హమ్ శిక్షణ శిబిరానికి రాలేదు. నిబంధనల కారణంగా పంత్‌తో సన్నిహితంగా మెలిగిన సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా రాలేదు. మరో పది రోజుల తర్వాత వీరంతా డుర్హమ్ చేరుకోనున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆగష్టు 4న ప్రారంభం కానుంది. ఈ మ్యాచుకు ముందు భారత్ ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
రిషబ్ పంత్‌కు ఈ నెల 8న పాజిటివ్‌గా తేలింది. అంతకు రెండు రోజుల ముందు.. జులై 5, 6 తేదీల్లో పంత్ ఓ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ క్లినిక్‌లోనే అతనికి వైరస్ సోకి ఉంటుందని ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. అంతకుముందు జూన్ 29న పంత్ లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ ఫుట్‌బాల్ మ్యాచ్ చూశాడు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన సమయం, డెంటిస్ట్ దగ్గరకు వెళ్లిన సమయం చూస్తుంటే.. అతనికి కరోనా రావడానికి ఇదే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.