
పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లోనే పంత్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. టామ్ కరన్ వేసిన 42వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ బాది హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో ఇది పంత్‌కు రెండో ఫిఫ్టీ. హాఫ్ సెంచరీ ముందు పంత్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వగా..పంత్ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు. ఆపై సిక్స్, ఫోర్ బాది 50 మార్క్ చేరుకున్నాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేశాడు. సామ్ కరన్ వేసిన 44వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసి శతకం చేశాడు. 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో వన్డేల్లో ఐదవ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస వైఫల్యాలతో, జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్న రాహుల్.. వన్డే సిరీస్‌లో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. తొలి వన్డేలో అజేయమైన అర్ధ శతకంతో అదరగొట్టిన రాహుల్.. రెండో వన్డేలో ఏకంగా శతకొట్టేశాడు. సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ ఆరంభంలో ఆచితూచి ఆడినప్పటికీ.. అతర్వాత గేర్ మార్చి భారీ షాట్లు ఆడాడు.
పంత్, రాహుల్ చెలరేగడంతో భారత్ భారీ దిశగా దూసుకెళ్లింది. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో రాహుల్.. 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఓ సిక్స్ బాదాడు. మరోవైపు పంత్ సిక్సులు వర్షం కురిపిస్తున్నాడు. భారత్ 46 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బ్యాట్స్‌మన్ జోరు చూస్తే.. భారత్ 350 పరుగులు చేసేలా ఉంది.
అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, సిక్స్) కూడా అర్ధ శతకం పూర్తి చేశాడు. కోహ్లీ 62 బంతుల్లో ఫిఫ్టీ మార్కును చేరుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి సింగల్ తీసిన కోహ్లీ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అనంతరం సిక్స్ బాదిన కోహ్లీ.. 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. రషీద్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు.