
అహ్మదాబాద్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శుక్రవారం మధ్యాహ్నం వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే యాష్ అర్థంకాని విధంగా మూడు ట్వీట్లు చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ట్వీట్లు అందర్నీ అయోమయానికి గురిచేశాయి. అశ్విన్ ఏం చెప్పదల్చుకున్నాడో తెలియక నెటిజన్లు తలలు పట్టుకున్నారు. 'ఇన్ని రోజులు ప్రోడక్ట్‌లనే మార్కెటింగ్ ద్వారా అమ్మేవాళ్లు. ఇప్పుడు ఆలోచనలను అమ్ముతున్నారు. ఇది ఎలా ఉందంటే.. మీరు ఆలోచించలేరు కాబట్టి మేము అమ్ముతున్నాము అన్నట్లుగా ఉంది. పదేళ్ల క్రికెట్ ఆడిన తర్వాత నేను చెప్పేది ఒక్కటే. మేము వాటిని కొంటున్నన్ని రోజులూ వాళ్లు ఇలా మాపై రుద్దుతూనే ఉంటారు' అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇలా ఎందుకు రాసుకొచ్చాడో ఎవరికి అర్ధం కాలేదు.
అయితే ఓ మీడియా ఛానల్ రవిచంద్రన్ అశ్విన్ వరుస ట్వీట్లపై ఓ కథనం ప్రసారం చేసింది. యాష్ చేసిన ట్వీట్లు రైతు ఉద్యమం నేపథ్యంలో ఉన్నాయని అర్థం వచ్చేలా ప్రసారం చేసింది. ఆ కథనానికి సంబంధించిన వీడియోను తాజాగా పంచుకొని అశ్విన్ ధీటుగా బదులిచ్చాడు. 'వరుస ట్వీట్లలో నేను చెప్పింది ఇదే. నా ట్వీట్లకు రాజకీయ దురుద్దేశాలు అంటించవద్దని మీ అందర్నీ కోరుతున్నా. నా వృత్తి క్రికెట్ ఆడటం. నేను దాని గురించే మాట్లాడాను. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కల్పితాలు జోడించకండి' అని అశ్విన్ రాసుకొచ్చాడు.
మొతేరా మైదానంలో జరిగిన డేనైట్ టెస్టులో భారత్ రెండు రోజుల్లోనే ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన నేపథ్యంలో మొతేరా పిచ్‌పై అనేక విమర్శలొచ్చాయి. స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించిన ఈ పిచ్ టెస్టులకు పనికిరాదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. దాంతో ఆయా క్రికెటర్ల వ్యాఖ్యలపై స్పందిస్తూ రవిచంద్రన్ అశ్విన్ వరుస ట్వీట్లు చేశాడని కొందరు అభిమానులు కామెంట్లు పెట్టారు. ఏదేమైనా అశ్విన్ చేసిన ట్వీట్లు నిజంగానే ఎవరికీ అర్థంకాలేదు.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో బౌలర్‌గా అశ్విన్ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (72 టెస్టులు) ఉన్నాడు.
ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆర్ అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ కన్నా ముందు భారత్ తరఫున కపిల్ దేవ్ (434), అనిల్ కుంబ్లే (619), హర్భజన్ సింగ్ (417) నాలుగు వందల వికెట్ల ఘనతను అందుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే 600 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610) అశ్విన్ కన్నా ముందున్నారు.