
చెన్నై: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డుపై సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ కన్నేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు సిరీస్‌లో భజ్జీ రికార్డును బద్దలు కొట్టాలని అశ్విన్ భావిస్తున్నాడు. తొలి రెండు టెస్టులకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. చెన్నైకి చెందిన అశ్విన్‌కి చెపాక్ స్టేడియం కొట్టినపిండి. దేశవాళీ, ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం అశ్విన్‌కు ఎంతో ఉంది. అంతేకాదు చెపాక్ పిచ్ స్పిన్నర్లు అనుకూలం. దీంతో తొలి రెండు టెస్టులలో అశ్విన్ కీలకం కానున్నాడు.
టెస్ట్ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ మరో 12 వికెట్లు పడగొడితే.. భారత్ గడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో స్పిన్నర్‌గా అరుదైన రికార్డు అందుకుంటాడు. భారత్ తరఫున ఇప్పటి వరకూ 74 టెస్టు మ్యాచ్‌లాడిన అశ్విన్.. 377 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 254 వికెట్లు భారత్ గడ్డపై ఆడిన టెస్టుల్లో తీసినవే. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (350), హర్భజన్ సింగ్ (265) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో 12 వికెట్లు తీస్తే భజ్జీని వెనక్కి నెట్టి అశ్విన్ రెండో స్థానానికి చేరుకుంటాడు.
అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417)ల తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్వినే (377). ఇక రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో అశ్విన్ మరో 8 మందిని ఔట్ చేస్తే.. స్వదేశంలో ఇంగ్లీష్ జట్టుపై 50 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో చేరతాడు. బి.ఎస్.చంద్రశేఖర్ (64), అనిల్ కుంబ్లే (56), బిషన్‌సింగ్ బేడీ (50)లు ఈ జాబితాలో అశ్విన్ కంటే ముందు ఉన్నారు. 2011 నుంచి టెస్టుల్లో ఆడుతున్న అశ్విన్ 74 టెస్టుల్లో 377 వికెట్లు పడగొట్టగా.. ఇందులో 27 సార్లు ఐదు వికెట్ల మైలురాయి, ఏడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమిండియా 'డ్రా' చేసుకున్నవిషయం తెలిసిందే. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్; 128 బంతుల్లో 7×4), హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (23 నాటౌట్; 161 బంతుల్లో 4×4) అద్భుతంగా ఆడి భారత్‌ను ఓటమి నుంచి బయటపడేశారు. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు 259 బంతులాడి కేవలం 62 పరుగులు చేశారు. వీరి దూర్బేధ్యమైన డిఫెన్స్‌ను ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లైయన్ ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.