తొలి రెండు టీ20ల్లోనూ ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని డీకోడ్ చేయలేక ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా విధ్వంసక ప్లేయర్ హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో వరుసగా వికెట్ పారేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఒప్పుకోకుండా.. స్మాగ్ (పొగ మంచు) వల్ల బంతి సరిగ్గా కనిపించక తాను ఔట్ అయ్యానని కామెంట్స్ చేసి విమర్శలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా హ్యారీ బ్రూక్ పై కీలక కామెంట్స్ చేశాడు. అతడిపై సెటైర్లు వేశాడు.
"చెన్నైలో స్మాగ్ లేదు. హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కానీ కోల్ కతాలో స్మాగ్ వల్ల ఔట్ అయ్యానని అన్నాడు. మరి రెండో మ్యాచ్ లో అంతా బాగానే కనపడుతున్నప్పటికీ ఔట్ అయ్యావ్ కదా. వరుణ్ లెగ్ స్పిన్ బౌలింగ్ చేయలేదు. కేవలం గూగ్లీస్ పైనే దృష్టి పెట్టి బంతులు సంధించాడు. కోల్ కతాలో బ్రూక్ బౌల్డ్ అయ్యాడు.

అందుకే తర్వాతి మ్యాచ్ లో లెగ్ స్టంప్ ఆడేందుకు ప్రయత్నించాడు. చెన్నై మ్యాచ్ లో ఫ్రంట్ ఫూట్ తో ఆడేందుకు ప్రయత్నించి గూగ్లీని అర్థం చేసుకోలేక విఫలమయ్యాడు. వికెట్ పారేసుకున్నాడు. సాధారణంగా ఓ బ్యాటర్.. వరుణ్ వేసే గూగ్లీని బాగా అర్థం చేసుకోగలరు. అక్కడ వెలుతురు అనేది సమస్యే కాదు. మీరు గూగ్లీని అర్థం చేసుకోలేకపోతే ఆడలేరంతే." అని చెప్పుకొచ్చాడు.
తొలి టీ20లో హ్యారీ బ్రూక్.. 17 బంతుల్లో 14 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం రెండో మ్యాచ్ కు ముందు స్మాగ్ వల్లే ఔట్ అయ్యానని కామెంట్స్ చేశాడు. ఇక రెండో మ్యాచ్ లోనూ పవర్ ప్లే ముగిసిన తర్వాత బౌలింగ్ కు వచ్చిన వరుణ్ బౌలింగ్ లోనే.. మళ్లీ తన వికెట్ సమర్పించుకున్నాడు హ్యారీ బ్రూక్. ఆ ఓవర్ మూడో బంతికే బ్రూక్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు హ్యారీ బ్రూక్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు.