భారత్-ఇంగ్లండ్ అయిదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఉప్పల్ టెస్టులో ఇంగ్లిష్ జట్టు విజయం సాధిస్తే, వైజాగ్ టెస్టులో టీమిండియా సత్తాచాటింది. అయితే టీమిండియా సెలక్టర్లు తొలి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ఎంపికచేశారు. చివరి మూడు టెస్టులకు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. మరో రెండు రోజుల్లో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే భారత జట్టులో ఎవరు ఉంటారనే ఆసక్తి అందరిలో పెరిగింది. విరాట్ కోహ్లి తిరిగి వస్తాడా లేడా అనే ఉత్కంఠ మొదలైంది. అతడి నుంచి కబురు కోసమే సెలక్టర్లు ఎదురుచూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ గురించి స్పష్టత రాలేదు. మరోవైపు జట్టులో మార్పులు చేయాలని, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రకటనపై అందరి చూపు నెలకొంది. తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్‌తో పాటు గిల్ ఉంటారు. కానీ కోహ్లి ఆడే నాలుగో స్థానం గురించే అసలు ప్రశ్న. కోహ్లి అందుబాటులో ఉంటే రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఒకరే ఎంపిక చేయాల్సి పరిస్థితి ఉంటుంది.
రజత్ పటిదార్‌కు రెండో టెస్టులో అవకాశం ఇచ్చారు. సాధికారికంగానే ఆడినా మెరుగైన స్కోరు చేయలేకపోయాడు. మరోవైపు సర్ఫరాజ్ ఎట్టకేలకు జట్టులో స్థానం దక్కించుకున్నా తుదిజట్టులో ఛాన్స్ రాలేదు. వాళ్లకు మరో అవకాశం ఇవ్వకుండానే చివరి మూడు టెస్టులకు సెలక్టర్లు పక్కనపెట్టలేని పరిస్థితి. కేఎల్ రాహుల్ దాదాపు కోలుకున్నాడని సమాచారం.రాహుల్ బ్యాటర్‌గానే జట్టులోకి ఎంపిక అవ్వడం సెలక్టర్లకు మరింత పరీక్ష పెడుతోంది.
దీంతో రంజీ ట్రోఫీల్లో రాణిస్తున్న పుజారా రీఎంట్రీ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకపోలేదు. శ్రేయస్ అయ్యర్‌ను ఫామ్ కారణంతో సెలక్టర్లు పక్కనపెట్టలేరు. కానీ విశ్రాంతి పేరుతో అతడిని ఎంపిక చేయకపోతే రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఇద్దరూ జట్టులో ఉండే అవకాశాలు ఉంటాయి. మరోవైపు జడేజా టెస్టు సిరీస్‌కు దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్ సుందర్‌ను అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
చివరి మూడు టెస్టులకు భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్/సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్.