అందరూ నమ్మడం మానేసారు.. మేం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు: విరాట్ కోహ్లీ

నాటింగ్‌హామ్: టీమిండియాను నమ్మడం మానేసినా.. ఆటగాళ్లు మాత్రం తమపై నమ్మకాన్ని కోల్పోలేదు' అని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాటింగ్‌హామ్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో అద్భుత ఆటతీరుని కనబర్చిన భారత్ జట్టు 203 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో 97, 103 పరుగులతో మెరవగా.. బౌలర్లు హార్దిక్ పాండ్యా (6/50), జస్‌ప్రీత్ బుమ్రా (7/122) బంతితో ఆకట్టుకున్నారు.

అందరూ నమ్మకం కోల్పోయినా.. మమ్మల్ని మేం నమ్మాం:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. మేం సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డాం. దీంతో మాపై అందరూ నమ్మకం కోల్పోయారు. కానీ మాపై మేం నమ్మకముంచాం. అందుకే ఇప్పుడు 1-2తో పుంజుకున్నాం. బయట ఎవరు ఏమనుకున్నా డ్రెస్సింగ్ రూంలో మేం ఏమనుకుంటామన్నది ముఖ్యం. మేం సిరీస్ గెలవగలమనే అనుకున్నాం. అలా ఉన్నాం కాబట్టే..సిరీస్‌లో 1-2తో తాజాగా నిలవగలిగాం. డ్రెస్సింగ్ రూములో సానుకూల వాతావరణంతోనే మా ఆటతీరు మారింది తప్ప.. వెలుపల నుంచి వచ్చిన విమర్శల వల్ల కాదు.

ఈ సిరీస్ గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాం:
ఇప్పుడు కూడా ఈ సిరీస్ గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. అన్ని విభాగాల్లో చక్కటి ప్రదర్శన చేశాం. ఇది పరిపూర్ణ విజయం. ఇది అందరికీ చెందుతుంది. నా విషయానికొస్తే 2014 వైఫల్యం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు కోసం పరుగులు సాధించడం చాలా సంతోషంగా ఉంది. లార్డ్స్ ఓటమి తర్వాత మేమేమీ కుంగిపోలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి మొదలుపెడితే ఐదు టెస్టుల్లో మేం చిత్తుగా ఓడింది ఆ ఒక్క మ్యాచ్‌లోనే. మూడో టెస్టులో స్కోరు బోర్డుపై పరుగులుండటం వల్లే ఆధిపత్యం చలాయించగలిగాం. బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు.

బ్యాటింగ్, బౌలింగ్‌కు తోడు స్లిప్ క్యాచింగ్ కూడా
అశ్విన్ గాయంతో ఇబ్బంది పడుతూ కూడా సత్తా చాటాడు. బౌలర్లు 20 వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నపుడు బ్యాట్స్‌మెన్‌గా మనం ఏం చేయాలని ఆలోచించాం. ఈ విషయంలో అందరూ బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు తోడు స్లిప్ క్యాచింగ్ కూడా బాగుండటంతో మ్యాచ్ గెలిచాం. తొలి ఇన్నింగ్స్‌లో నాకు, రహానెకు మధ్య భాగస్వామ్యం మ్యాచ్‌కు కీలకంగా మారింది.

మా గెలుపు.. కేరళకు అంకితం:
ఇంగ్లాండ్‌కు మంచి బౌలింగ్ దళముంది. వారిపై పరుగులు చేయాలంటే ఎంతో పట్టుదల ఉండాలి. రహానె తొలి ఇన్నింగ్స్‌లో, పుజారా రెండో ఇన్నింగ్స్‌లో ఆ పట్టుదలే చూపించారు. సిరీస్‌లో ఆడిన నలుగురు ఫాస్ట్‌బౌలర్లూ సత్తా చాటడం చాలా సంతోషాన్నిస్తోంది. వారి ఫిట్‌నెస్ మెరుగైంది... ఆలోచన దృక్పథమూ మారింది. టెస్టు సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకున్న భారత్ జట్టు.. ఆ గెలుపుని కేరళ వరద బాధితులకి అంకితమిచ్చి... మ్యాచ్ ఫీజు మొత్తాన్ని.. అంటే సుమారు రూ 1.26 కోట్లని బాధితులకి విరాళంగా టీమిండియా ఇచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications