ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన కసితో సన్నద్ధమవుతుంది. అయితే భారత జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు.
గాయాలతో సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వడంతో భారత తుదిజట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్ కోసం ప్రయత్నించిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. రాహుల్ కూడా తొడకండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. అయితే వీరిద్దరి స్థానాల్లో సెలక్టర్లు ముగ్గరు ఆటగాళ్లను ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు.

అలాగే వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి స్థానంలో రజత్ పటిదార్ ఎంపికయ్యాడు. కానీ విరాట్ గైర్హాజరీలో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇప్పుడు రాహుల్ కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఒకరికి కచ్చితంగా తుదిజట్టులో అవకాశం దక్కనుంది. అయితే వీరిద్దరిలో సర్ఫరాజ్ తుదిజట్టులో ఉంటాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
'' ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆ స్థానంలో ఆడే అర్హత ఉన్న వ్యక్తి కచ్చితంగా అతడే అని అభిప్రాయపడుతున్నా. సర్ఫరాజ్ 66 ఇన్నింగ్స్‌ల్లో 3912 పరుగులు చేశాడు. 69 సగటుతో అసాధారణంగా ఆడాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది గొప్ప ఫస్ట్ క్లాస్ రికార్డు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేయడం గొప్ప విషయం. అయితే రజత్ పటిదార్ కూడా సత్తాచాటుతున్నాడు. అతడికి కూడా అవకాశం దక్కాలని ఆశిస్తున్నా'' అని డివిలియర్స్ అన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌లతో కలిసి డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 2015లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు.