
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టులో ఇరు జట్లకు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ అయినా సెంచరీ చేసినా, ఏ బౌలర్ అయినా ఐదు వికెట్లు తీస్తే ఇరవై వేల పౌండ్లు విరాళంగా ఇస్తానని ఇంగ్లాండ్‌కు చెందిన మిక్ జాగర్ ప్రకటించాడు.
శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిక్ జాగర్ మాట్లాడుతూ "భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం జరుగుతోన్న సిరీస్‌ను అభిమానులు ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు. లండన్ వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం చివరి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఏ ఆటగాడైనా శతకం సాధిస్తే 20వేల పౌండ్లు, ఏ బౌలర్ అయినా ఐదు వికెట్లు తీస్తే ఇరవై వేల పౌండ్లు విరాళంగా ఇస్తా" అని ప్రకటించాడు.
"అంతేకాదు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లకు పదివేల పౌండ్లు, మూడు వికెట్లు తీసినా పది వేల పౌండ్లు అందజేస్తా. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలోనే ఇలా చేస్తున్నా" అని మిక్ జాగర్ తెలిపాడు. క్రికెట్ అంటే జాగర్‌కు ఎంతో ఇష్టం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు జరుగుతున్నా స్వయంగా మైదానానికి వెళ్లి చూస్తాడు.
ఇప్పటివరకు అనేక వరల్డ్ కప్, యాషెస్ సిరీస్‌లకు సంబంధించిన మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జాగర్ ఇంగ్లాండ్ జట్టు ఆడే మ్యాచ్‌లనే కాదు ఇతర దేశాలకు చెందిన మ్యాచ్‌లను సైతం వీక్షిస్తాడు. కొద్ది నెలల క్రితం ఐర్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా జాగర్ హాజరయ్యాడు.