
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందుతానని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనుభవాన్ని ఉపయోగించి టెస్టులో తొలి సెంచరీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా భారత ఆటగాళ్లతో స్నేహం ఏర్పడినా దేశాల తరఫున ఆడేటప్పుడు మైదానంలో కసిగా పోరాడతామని బట్లర్ అన్నాడు.
'విరాట్ కోహ్లీ తెలివైన బ్యాట్స్‌మెన్. అతడి ఆటను చూస్తే చాలు ఎంతో నేర్చుకోవచ్చు. అతడిలాంటి వైఖరితో ఎత్తుకు ఎదగొచ్చు. అతనిలాంటి వారెప్పుడైనా చాలాసార్లు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కోహ్లీ లాంటివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలా ఆలోచించి రాణించాలనుకుంటారు' అని బట్లర్ అన్నాడు.
ఈ సారి టెస్టులో సెంచరీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆలస్యంగా బరిలోకి దిగిన బట్లర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అయితే ఇంగ్లాండ్ జాతీయ జట్టు సెలక్టర్ ఎడ్ స్మిత్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో బట్లర్ చేసిన ప్రదర్శన టెస్టుల్లో ఆడేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా నమ్మే సొంతగడ్డపై బట్లర్‌ను పాకిస్తాన్‌కు ప్రత్యర్థిగా ఏడో స్థానంలో దింపడం చాలా ప్రయోజనకరమని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన బట్లర్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు, రెండుసార్లు 90 నాటౌట్‌తో నిలిచాడు. 'అత్యుత్తమ ఆటగాళ్లు ఏం చేస్తారో, వారికి ఎందుకు ప్రశంసలు లభిస్తాయో ఐపీఎల్ ద్వారా నేర్చుకున్నా. వారి వైఖరి భిన్నంగా ఉంటుంది. ప్రతి ఆటలోనూ గెలవాలనుకుంటారు. నిలకడగా అదే పనిచేస్తారు. వారితో పాటు సాధన చేసి, గడిపి ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నాను' అని బట్లర్ అన్నాడు. ప్రస్తుతం జరిగే సిరీస్ చాలా పెద్దదని, భారత్‌తో ఆటంటే యాషెస్ లాంటిదేనని పేర్కొన్నాడు.