India vs England: జోరు మీదున్న జో రూట్.. క్రికెట్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా మరో రికార్డు!!

చెన్నై: భారత్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ జోరు మీదున్నాడు. శ్రీలంక పర్యటనలో కనబర్చిన ఫామ్‌ను భారత్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా రూట్ రికార్డుల్లోకి ఎక్కగా.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లో అతడు 150 పరుగుల మైలురాయి అందుకున్నాడు.

వందో టెస్టులో శతకం:
శుక్రవారం జో రూట్ (128 నాటౌట్) అజేయ శతకంతో నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా రూట్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కొలిన్ కౌడ్రె, జావెద్ మియాందాద్, గార్డన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవార్ట్, ఇంజమామ్ ఉల్ హాక్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హషిమ్ ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించారు. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న రూట్‌కు ఇది 20వ సెంచరీ. తొలుత హాఫ్ సెంచరీకి 110 బంతులు తీసుకున్న రూట్.. అనంతరం ధాటిగా ఆడి మరో 54 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.

ఏకైక ఆటగాడిగా రికార్డు:
ఇంగ్లండ్ తొలి రోజు 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన జో రూట్.. డొమినిక్ సిబ్లీ (87; 286 బంతుల్లో 12x4)తో కలిసి మూడో వికెట్‌కు 200 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో సిబ్లీ ఔటయ్యాక ఆట నిలిచిపోయింది. రెండో రోజు శనివారం బెన్ స్టోక్స్‌తో కలిసి రూట్ బ్యాటింగ్ ఆరంభించగా.. షాబాజ్ నదీమ్ వేసిన 111వ ఓవర్‌లో సింగిల్ తీసి 150 పరుగులు పూర్తి చేశాడు. దీంతో 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

అత్యధిక సార్లు 150కి పైగా పరుగులు:
మరోవైపు వరుస టెస్టుల్లో అత్యధిక సార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ కీపర్ కుమార సంగక్కర ఉన్నాడు. 2007లో సంగక్కర నాలుగు సార్లు ఆ ఘనత సాధించి టాప్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వాలీ హేమండ్ (1928-29), డాన్ బ్రాడ్‌మన్ (1937), జహీర్ అబ్బాస్ (1982-83), ముదస్సార్ నజర్ (1983), టామ్ లాథమ్ (2018-19), జో రూట్ (2021) వరుసగా ఉన్నారు.

వీడియోలతో సర్‌ప్రైజ్ ఇచ్చారు:
వందో టెస్టు ఆడటంపై రూట్ స్పందించాడు. 'కెరీర్లో వందో టెస్టు ఆడటం ఎంతో ప్రత్యేకం. ప్రస్తుత ఫామ్‌ను అందిపుచ్చుకొని భారీ పరుగులు చేయాలనుకున్నా. ఎందుకంటే కెరీర్లో ప్రతిసారీ భారీ స్కోర్లు చేయలేం కదా. భారీ పరుగులు చేసి జట్టును గెలిపించాలన్నదే నా ఉద్దేశం. వందో టెస్టుకు ముందు రాత్రి మా జట్టు సభ్యులు గత ఆటగాళ్ల వీడియోలతో నాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు' అని జో రూట్ చెప్పుకొచ్చాడు.
IPL 2021 వేలం బరిలో అర్జున్.. కనీస ధర ఎంతో తెలుసా?! రేసులో విహారి, పుజారా!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications