
చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి సెషన్‌లో ఇంగ్లండ్ నిలబడి తడబడింది. లంచ్ బ్రేక్ సమయానికి ముందు ఇంగ్లీష్ జట్టు వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 24వ ఓవర్‌లో ఓపెనర్ రోరీ బర్న్స్ (33)ను ఔట్ చేయగా.. 26వ ఓవర్‌లో లారెన్స్ (0)ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. దీంతో రూట్ సేన 63 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ప్రస్తుతం సిబ్లీ (26), జో రూట్ (4) ఉన్నారు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 67 రన్స్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ శుభారంభం చేశారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. 2017 తర్వాత ఇండియాలో పర్యటిస్తున్న టీమ్ తరఫున 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన తొలి ఓపెనింగ్ జోడీ వీళ్లదే కావడం విశేషం. అయితే లంచ్‌కు ముందు ఇంగ్లండ్ రెండు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.
ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని ఆర్ అశ్విన్ విడదీశాడు. 24వ ఓవర్‌లో బర్న్స్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బుమ్రా వేసిన 26వ ఓవర్‌లో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ లారెన్స్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. లారెన్స్ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.