
అహ్మదాబాద్: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో మొతేరాలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో సునాయసంగా చేధించింది. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌ర్లు) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో తేలిపోయిన భారత్ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. మొతేరాలోనే రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది.
125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. 15.3 ఓవర్లలలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ ఇంగ్లండ్ విజయానికి బాట వేశారు. బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అయితే 11వ ఓవర్ తొలి బంతికి వికెట్ల ముందు వాషింగ్టన్ సుందర్‌కు చహల్‌కు దొరికిపోయాడు. అనంతరం రాయ్ కూడా సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఆపై డేవిడ్ మలాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్ స్టో (17 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు)లు ఆచితూచి ఆడారు. ముందుంది స్వల్ప లక్ష్యమే కాబట్టి ఆడుతూపాడుతూ పరుగులు చేశారు. పెద్దగా కష్టపడకుండానే మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 28 బంతుల్లో 41 పరుగులు జోడించారు. సుందర్ వేసిన 15.3వ బంతిని సిక్సర్‌గా మలిచిన మలన్ మ్యాచును ముగించాడు. చహల్, సుందర్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా వారంతా పరుగులు చేయలేకపోయారు. రిషబ్ పంత్ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 19; 1 ఫోర్, 1సిక్స్) పర్వాలేదనిపించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), కేఎల్ రాహుల్ (1).. కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. మార్క్‌వుడ్, స్టోక్స్, రషీద్, జోర్డాన్ తలా ఓ వికెట్ తీశారు.