
ఆండర్సన్ అదరగొట్టాడు
'భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు గొప్పగా సాగింది. చివరిరోజు వరకు ఇరు జట్లు బాగా ఆడాయి. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతంగా ఆడాడు. శ్రీలంక ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అదరగొట్టాడు. వయసు కేవలం అతడికి ఒక సంఖ్యే అని చాటిచెప్పాడు.
ఇప్పటికీ అతడి బంతులలో పదును తగ్గలేదు. మొత్తానికి ఇంగ్లండ్ చక్కని ప్రదర్శన చేసింది. ప్రతి ఒక్కరు ఆకట్టుకున్నారు' అని జమైకా స్ప్రింటర్ యోహన్ బ్లేక్ అన్నాడు. 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్లేక్ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 100 మీ, 200 మీ పరుగులో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తర్వాత అతివేగవంతమైన పరుగుల వీరుడిగా బ్లేక్ రికార్డులు సృష్టించాడు.

కోహ్లీ కెప్టెన్సీని ప్రేమిస్తున్నా
'టీమిండియా అంటే నాకు ఎంతో ఇష్టం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రేమిస్తున్నాను. అతడు తప్పులు, వైఫల్యాల్ని అంగీకరిస్తాడు. బౌలర్లు బంతుల్ని సరైన ప్రదేశాల్లో వేయలేదని, బ్యాట్స్‌మెన్ నిలకడగా పరుగులు సాధించలేదని తొలి టెస్ట్ ఓటమి తర్వాత ఒప్పుకున్నాడు. జట్టు ప్రణాళికలు గురించి తిరిగి ఆలోచిస్తామని చెప్పాడు. అందుకే కోహ్లీ నాయకత్వం అంటే నాకు ఎంతో ఇష్టం' అని యోహన్ బ్లేక్ తెలిపాడు. 'యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంతో బాగుంది. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుతం. ప్రతీసారి గొప్ప ఇన్నింగ్స్‌లు సాధించడం సాధ్యం కాదు. కానీ పంత్ టెస్టు క్రికెట్ బాగా ఆడతాడు' అని పేర్కొన్నాడు.

రెండో టెస్టు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా
'చేటేశ్వర్ పుజారా ఎంతో నాణ్యమైన బ్యాట్స్‌మన్. ఆస్ట్రేలియాలో అతడి పోరాటాన్ని చూశాను. అజింక్య రహానే సారథిగా మార్కులు సంపాదించాడు. టెస్టు క్రికెట్ మానసికంగానూ ఎంతో సవాల్. అందుకే సుదీర్ఘ ఫార్మాట్ నాకు ఎంతో ఇష్టం. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ తొలుత 0-1తో వెనుకంజలో ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే పరిస్థితి. అయితే స్వదేశంలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. రెండో టెస్టు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా' అని స్ప్రింటర్ యోహన్ బ్లేక్ చెప్పుకొచ్చాడు. చెన్నై వేదికనే శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
IPL 2021: ఆర్సీబీ బ్యాటింగ్ సలహాదారుగా టీమిండియా మాజీ కోచ్!!


Click it and Unblock the Notifications












