
హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లో వర్షం కారణంగా ఆదివారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎలాగైనా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కసితో కోహ్లీసేన సోమవారం వర్ష సూచన లేకపోవడంతో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. తొలి టెస్టు నేపథ్యంలో తొలి టెస్టులో జట్టు కూర్పుపై టీమిండియా మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది.
భారత జట్టులో మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ తర్జన భర్జనలు పడుతోంది. వార్మప్ మ్యాచ్‌లో రాణించిన మురళీ విజయ్ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, మురళీ విజయ్‌కు జోడీగా మరో ఓపెనర్‌గా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్ రికార్డు పేలవంగా ఉండటంతో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ వేదికగా ఇప‍్పటివరకూ ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్ 122 పరుగులే చేశాడు. ధావన్ అత్యధిక స్కోరు 37.
ఇటీవలే ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో విఫలమైన ధావన్, మూడు వన్డేల్లో 40, 36, 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక, ఇంగ్లీషు గడ్డపై తొలి టెస్టు ఆడేందుకు రాహుల్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తొలి టీ20లో సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
తన కెరీర్‌లో ఇప్పటివరకు 34 టెస్టు ఇన్నింగ్స్‌లాడిన కేఎల్ రాహుల్ 43.58 సగటుతో 1438 పరుగులు చేశాడు. ఇక, ఓపెనింగ్ భాగస్వామ్యం విషయానికి వస్తే మురళీ విజయ్, ధావన్ కలిసి 39 ఇన్నింగ్స్‌ల్లో 44.18 సగటుతో 1678 పరుగులు చేయగా... మురళీ విజయ్, రాహుల్ కలిసి 20 ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు 471 పరుగులు జోడించారు.
జట్ల వివరాలు:
ఇండియా:
Virat Kohli (c), Shikhar Dhawan, Murali Vijay, KL Rahul, Cheteshwar Pujara, Ajinkya Rahane, Dinesh Karthik (wk), Rishabh Pant, Karun Nair, Hardik Pandya, R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Ishant Sharma, Umesh Yadav, Shardul Thakur, Mohammed Shami, Jasprit Bumrah.
ఇంగ్లాండ్:
Joe Root (c), Alastair Cook, Keaton Jennings, Jonny Bairstow, Jos Buttler, Ben Stokes, Dawid Malan, Moeen Ali, Adil Rashid, Jamie Porter, Sam Curran, James Anderson, Stuart Broad.
ఐదు టెస్టులు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి.