
హైదరాబాద్: ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన టీమిండియా.. కచ్చితంగా గెలవాల్సిన మూడో టెస్టులో రాణించాలని ఎంత ఆశపడుతుందో.. అంతే స్థాయిలో విజయ పరంపరను కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు ఆరాటపడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్టు ఆడబోయే జట్టుని కూడా ప్రకటించేసింది. భారత్‌తో శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ సెలక్టర్లు ఎలాంటి మార్పులు లేకుండానే జట్టుని సోమవారం ప్రకటించారు.
లార్డ్స్‌లో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో జట్టు ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. అదే జట్టుని మూడో టెస్టులోనూ కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. కొద్ది నెలలుగా క్లబ్ బయట జరిగిన వివాదం కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్‌ను దూరం పెడుతూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మూడో టెస్టులో పాల్గొనే జట్టును ప్రకటించింది. తాజా ప్రకటనతో.. బెన్‌స్టోక్స్ ఈ మ్యాచ్‌లో కూడా ఆడబోవట్లేదని తేలిపోయింది.
అతని స్థానంలో రెండో టెస్టు మ్యాచ్ ఆడిన ఆల్‌రౌండర్ క్రిస్‌వోక్స్ బాధ్యతాయుత సెంచరీ బాది ఇంగ్లాండ్ జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు.. ఆదివారం లార్డ్స్ టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ జట్టు 2-0తో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది.
మూడో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, జో రూట్ (కెప్టెన్), పోప్, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), జోస్ బట్లర్, క్రిస్‌వోక్స్, కుర్రాన్, అదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ, పోర్టర్..
ఇదిలా ఉంటే రెండు టెస్టుల వైఫల్యాన్ని మూట గట్టుకున్న టీమిండియా మూడో టెస్టుకు సన్నద్ధమవ్వాల్సిన తరుణంలో బీసీసీఐ భారీ స్థాయిలో హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటి వరకూ ఉన్న అధికారాలను కెప్టెన్ కోహ్లీ.. కోచ్ రవిశాస్త్రి సరిగా వాడుకోవట్లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఇంకా రెండు మ్యాచ్‌ల వైఫల్యంపై వివరణ కోరినట్లు వెల్లడించారు.