
సిడ్నీ: పూణే శివార్లలో ఉన్న ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మంగళవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఇక మార్చి 26, మార్చి 28 తేదీల్లో రెండో, మూడో వన్డే జరుగనున్నాయి. ఇటీవల అద్భుత ఫామ్‌ల ఉన్న కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణకు వన్డే సిరీస్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. అతడితో పాటు రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా బీసీసీఐ అవకాశం కల్పించింది.
భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న ప్రసీద్ కృష్ణకు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ శుభాకాంక్షలు తెలిపాడు. సిరీస్‌లో మెరుగ్గా రాణించి.. గొప్ప పేరు తెచ్చుకోవాలని అతడు ఆకాంక్షించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెబుతూ ప్రసీద్ కృష్ణ ఫొటో షేర్ చేసిన ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ అతడిని అభినందించాడు. 125 టెస్టులు. 250 వన్డేలు ఆడిన 51 ఏళ్ల మెక్‌గ్రాత్.. 2003 ప్రపంచకప్ ఆసీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మూడు సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించిన ప్రసీద్ కృష్ణ నిలకడగా రాణించాడు. ఐపీఎల్‌లో ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లతో కలిసి ఆడాడు. ఇక ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా 14 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడికి అంతర్జాతీయ వన్డేల్లో ఆడే అవకాశం లభించింది. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, శార్ధూల్ ఠాకూర్ రూపంలో ముగ్గురు పేసర్లు తొలి వన్డేలో ఆడనున్నారు. దీంతో కృష్ణ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
టీమిండియాకు తాను సెలక్ట్ అయ్యాయని తెలియగానే ప్రసీద్ కృష్ణ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'దేశం తరఫున ఆడేందుకు పిలుపు రావడం ఒక వింత అనుభూతినిచ్చింది. నా కల నిజమైంది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఇక నేను ఎదురుచూడలేను. తొందరగా సిరీస్ ఆరంభమైతే బాగుండు' అని ట్వీట్ చేశాడు.