
లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయంను ఎదుర్కొన్న ఇంగ్లండ్.. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని ఆ దేశ అభిమానులు, మాజీలు ఇంగ్లండ్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని జస్ప్రీత్ బుమ్రాపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లండ్ టీమ్ మూల్యం చెల్లించుకుందని ఆ దేశ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ మండిపడ్డాడు. బుమ్రాని టార్గెట్ చేసి.. మహ్మద్ షమీని ఔట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని బాయ్‌కాట్ చురకలు అంటించాడు. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సేన 120 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 181/6తో భారత్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించగా.. అప్పటికి భారత్ ఆధిక్యం 154 పరుగులే. తొలి సెషన్ ఆరంభంలోనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ (22), ఇషాంత్ శర్మ (16) కూడా త్వరగా ఔట్ అయ్యారు. దాంతో భారత్ జట్టు కనీసం 200 పరుగులు అయినా చేస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. ఇక భారత్ ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే మహమ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) జోడి అద్భుతం చేసింది. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు.
అయితే జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి రాగానే జేమ్స్ అండర్సన్ ప్రతీకారం కోసం బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు విసిరాడు. అంతేకాకుండా సహచరులు మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్‌లకి కూడా అవే సూచనలు చేశాడు. దాంతో బుమ్రా కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇందుకు కారణం లేకపోలేదు తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ని షార్ట్ పిచ్ బంతులతో బుమ్రా ఇబ్బందిపెట్టాడు. మరోవైపు జోస్ బట్లర్‌తో పాటు బౌలర్లు కూడా తమ నోటికి పనిచెప్పారు. ఇది ఆగ్రహించిన మహ్మద్ షమీ భారీ షాట్లు ఆడాడు. దీంతో బుమ్రా-షమీ జోడీ 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో ఇన్నింగ్స్‌ని 298/8తో డిక్లేర్ చేసిన భారత్.. ఇంగ్లండ్ ముందు 272 పరుగుల టార్గెట్‌ని నిలిపింది. ఛేదనలో రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది.
'లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కెప్టెన్సీ బాగుంది. కానీ జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో పాటు అనవసర మాటలతో అతడ్ని రెచ్చగొట్టారు. మార్క్ వుడ్ మధ్యలో ఫాస్ట్ షార్ట్ బాల్స్‌తో మరింత రెచ్చగొట్టాడు. ఇంగ్లండ్ టీమ్‌లోని ఆటగాళ్లు బుమ్రాపై అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూశారు. ఈ క్రమంలో అతనిపై ముప్పేట దాడికి దిగారు. కానీ మరో ఎండ్‌లోని మహ్మద్ షమీని ఔట్ చేయడంపై వారు శ్రద్ధ పెట్టలేదు. మీరు బుద్ధి లేని వారయితే.. టెస్టు మ్యాచ్‌లను గెలిచేందుకు మీరు అనర్హులు' అని జెఫ్రీ బాయ్‌కాట్ పేర్కొన్నాడు.
టీమిండియా లోయర్ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. కెప్టెన్‌గా తాను కూడా పొరపాట్లు చేశానని అంగీకరించాడు. రెండో టెస్టులో విజయం ఖాయం అనుకున్నామని.. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని స్పష్టం చేశాడు. బుమ్రాపై ప్రయోగించిన షార్ట్ బంతుల వ్యూహం విఫలమైందని రూట్ తెలిపాడు. టీమిండియా దూకుడులో తప్పేమీ లేదని ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు.