
చెన్నై: చెన్నై చెపాక్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. నాలుగో రోజు టీ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యం కలుపుకొని మొత్తంగా 360 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే టీ సమయానికి ముందు ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్పిన్నర్ ఆర్ అశ్విన్ వేసిన తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌటయ్యాడు. స్లిప్‌లో అజింక్య రహానే క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే ఒక వికెట్ నష్టపోయింది. అనంతరం సిబ్లీ, లారెన్స్ కాసేపు వికెట్ కాపాడుకోవడానికి ప్రయతించారు. ఇక అశ్విన్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి సిబ్లీ (12) పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ 32 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది.
ఈ సమయంలో కెప్టెన్ జో రూట్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇషాంత్ శర్మ వేసిన 15.3 బంతికి వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ లారెన్స్ (18) వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు 58 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఇషాంత్‌కిది టెస్టుల్లో 300వ వికెట్ కావడం విశేషం. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో పేసర్‌గా నిలిచాడు. ఆ వెంటనే డేంజర్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ (7) ఔటయ్యాడు. అశ్విన్ వేసిన 18.1 ఓవర్‌కు బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడింది. 71కే నాలుగు వికెట్లు కోల్పోయిన సేపథ్యంలో రూట్, పోప్ కాసేపు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు.
బుమ్రా వేసిన 23.5 ఓవర్‌లో కెప్టెన్ జో రూట్ (40) ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ఆపై పోప్, బట్లర్ ఆచితూచి ఆడారు. టీ సమయానికి ఇంగ్లండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఓవరాల్‌గా 360 పరుగుల లీడ్‌లో ఇంగ్లండ్ ఉంది. అంతకుముందు టీమిండియా 337 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కోహ్లీసేనను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. ఆ పని చేయని ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తోంది. భారత బౌలర్లలో అశ్విన్ 3.. బుమ్రా, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు.