
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అయిన నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియంలో మరికొద్దిసేపట్లో గులాబీ బంతితో డే/నైట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌తో పాటు జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత జట్టులో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారు.
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. టీమిండియా, ఇంగ్లండ్ చెరో విజయంతో సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన మొతెరాలో అభిమానుల కేరింతలు మొదలయ్యాయి. ఈ స్టేడియం సామర్థ్యం లక్ష్యా పది వేలు. కరోనా నేపథ్యంలో సుమారు 55-60 వేల మంది ప్రేక్షకులతో మొతేరా మైదానంలో మోత మోగనుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంను బుధవారం వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి ప్రారరంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాల్గొన్నారు. ఈ కొత్త స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టడం గమనార్హం.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలీ, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓలి పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.