
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కీలకమైన ఆరో వికెట్ కోల్పోయింది. పర్యాటక జట్టు కెప్టెన్, డబుల్ సెంచరీ హీరో జో రూట్ ఇన్నింగ్స్‌కు ఎట్టకేలకు ముగింపుపడింది.153వ ఓవర్ చివరి బంతికి షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. అంతకుముందు ఓవర్‌లోనే ఓలి పోప్ (34)ను రవిచంద్రన్ అశ్విన్ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గత పది ఓవర్లలో 20 పరుగులు ఇచ్చిన ఆతిథ్య జట్టు 2 వికెట్లు తీసింది. మొత్తంగా అశ్విన్, నదీమ్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండు రోజులుగా భారత బలౌర్ల సహనాన్ని పరీక్షించిన జో రూట్ ఈ రోజు అవుట్ అయ్యాడు. 218 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. రూట్, పోప్ అనంతరం క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, డొమినిక్ బెస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 500 పరుగులు దాటింది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు 165 ఓవర్లకు 501/6 స్కోరు సాధించింది. బట్లర్ (22), బెస్ (3) క్రీజులో ఉన్నారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ (218) సాధించాడు. 142వ ఓవర్‌లో ఆర్ అశ్విన్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే హెల్మెట్ తీసి బ్యాడ్జి, హెల్మెట్‌ను ముద్దాడి తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న రూట్.. సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచి ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సరికొత్త అధ్యాయం లిఖించాడు. వందవ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించాడు. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు. బౌలర్లకు సహకరించని చిదంబరం స్టేడియంలో.. రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫ్లాట్‌గా ఉన్న పిచ్‌పై చాలా సులువుగా రూట్ తన షాట్లు ఆడాడు. అతని డబుల్ సెంచరీలో 19 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.