టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టు యాజమాన్యానికి కొంత ఆందోళన కలిగిస్తోంది. టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ.. ఈ వరల్డ్ కప్‌లో మాత్రం వరుసగా 3 సార్లు డకౌట్ అయ్యి నిరాశపరిచాడుయ అయితే అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచాలని మాజీ క్రికెట్ దిగ్గజం దినేష్ కార్తీక్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సూచించాడు.
దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే?
"ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలలో జట్టును ఇక్కడివరకు తీసుకువచ్చిన ఆటగాళ్లపై మనం నమ్మకం ఉంచాలి. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో సక్సెస్ కావాలంటే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లనే కొనసాగించాలని నేను నమ్ముతున్నాను" అని జియోస్టార్ మీడియా డే సందర్భంగా కార్తీక్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ.. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ జట్టుకు కలిసి వస్తుందని డీకే అభిప్రాయపడ్డాడు.

సంజూ శాంసన్ 'కోహ్లీ' తరహా ఇన్నింగ్స్
ఓ వైపు అభిషేక్ ఫామ్ ఇబ్బంది పెడుతున్నా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును సెమీస్‌కు చేర్చాడు. సంజూ శాంసన్ ఆటతీరు విరాట్ కోహ్లీని తలపిస్తోందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
అభిషేక్ అంటే ఇంగ్లాండ్‌కు భయం!
ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా.. ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం అభిషేక్ శర్మ పట్ల అప్రమత్తంగా ఉన్నారు. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై అభిషేక్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదిన విషయాన్ని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గుర్తు చేసుకున్నాడు. అభిషేక్ ఒక్కసారి క్రీజులో సెట్ అయితే మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చగలడని ఇంగ్లాండ్ శిబిరం భావిస్తోంది.
నేడే అసలైన పోరు
వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్ ఎటాకింగ్ గేమ్ ఆడుతుందా? లేదా ఒత్తిడికి లోనవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ టోర్నీలో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని దినేష్ కార్తీక్ ఆకాంక్షించారు.