
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం ఆరంభమైంది. డే/నైట్‌లో గులాబి బంతితో మ్యాచ్ జరుగుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. అయితే అతిపెద్ద అంతర్జాతీయ స్టేడియంగా రూపుదాల్చిన దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
సాధారణ టెస్ట్ మ్యాచ్ ఉదయం ప్రారంభం అయి సాయంత్రం ముగుస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం 9.30కి ప్రారంభం అయి సాయంత్రం దాదాపు 4.30కు ముగుస్తుంది. అయితే డే/నైట్ టెస్ట్ మాత్రం మధ్యాహ్నం ప్రారంభం అయి రాత్రి ముగుస్తుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30కి ప్రారంభమవుతుంది. తొలి సెషన్ సాయంత్రం 4.30కి ముగుస్తుంది. టీ విరామం 20 నిమిషాలు. అనంతరం 4.50కి ప్రారంభమయ్యే రెండో సెషన్ 6.50 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 40 నిమిషాలు డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఆఖరి సెషన్ రాత్రి 7.30 నుంచి 9.30 వరకు జరుగుతుంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లే ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవరలో సిబ్లే ఔటయ్యాడు. ఆ ఓవర్ మూడో బంతికి రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఏడు బంతులు ఆడిన సిబ్లే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మరికొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్ మొదటి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. టీమిండియా ఎల్బీ అప్పీల్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెయిర్ స్టో రివ్యూకి వెళ్లగా.. రిప్లేలో బంతి ఇంపాక్ట్ మిడిల్ స్టంప్‌పైకి వెళుతున్నట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ 27 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఆపై క్రాలే, రూట్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న క్రాలే బౌండరీల మోత మోగించాడు. దీంతో ఇంగ్లీష్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో అక్షర్ బౌలింగ్‌లో బౌండరీ బాది 67 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది నాలుగో ఫిఫ్టీ. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని స్పిన్నర్ ఆర్ అశ్విన్ విడదీశాడు. రూట్ (17) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 76 రన్స్ చేసింది. క్రాలే (53), స్టోక్స్ (2) క్రీజులో ఉన్నారు.
సెషన్ టైమింగ్స్:
తొలి సెషన్: 2.30 నుంచి 4.30
రెండో సెషన్: 4.50 నుంచి 6.50
ఆఖరి సెషన్: 7.30 నుంచి 9.30 వరకు